పటాన్‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న షెడ్డు పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. భక్తులు ఎండ, వానల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తన సొంత నిధులతో షెడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, నిర్మాణ వ్యయాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు నీలం మధును శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
