నన్ను గద్దె దింపేందుకు ఒక దేశం కుట్రచేసిందన్న ఇమ్రాన్

నన్ను గద్దె దింపేందుకు ఒక దేశం కుట్రచేసిందన్న ఇమ్రాన్
  • పాక్ లోని ముగ్గురు నేతలు వాళ్లతో చేతులు కలిపిన్రు 
  • ఇండియాతో దోస్తీకే ప్రయత్నించిన:పాక్​ ప్రధాని

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి పదవికి తాను రాజీనామా చేయబోనని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు. పార్లమెంటులో తనపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో లాస్ట్ బాల్ వరకూ పోరాడతానని ప్రకటించారు. మిత్రపక్షాలు మద్దతు వాపస్ తీస్కోవడంతో తన సర్కారు మైనారటీలో పడటం.. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ప్రతిపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో గురువారం సాయంత్రం పాక్ ప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ మాట్లాడారు. ప్రధాని పదవి నుంచి తనను దించేందుకు అమెరికా కుట్ర చేసిందన్న ఆయన.. ఆ తర్వాత ఒక ఫారిన్ కంట్రీ అంటూ మాట మార్చారు. పాకిస్తాన్ ను ఎవరి ముందూ తలవంచనివ్వబోనని చెప్పారు. అమెరికాతో కలిసి టెర్రరిజంపై జరిపిన పోరాటంలో పాక్ చాలా నష్టపోయిందని ఇమ్రాన్ అన్నారు.  

కుట్ర వెనక తొట్టిగ్యాంగ్ 

పీఎంఎల్ ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, పీపీపీ కో చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, పీడీఎం చీఫ్ మౌలానా ఫజలుర్ రెహమాన్ లను ఉద్దేశించి ఇమ్రాన్ పరోక్షంగా మండిపడ్డారు. పాక్ లో ముగ్గురు వ్యక్తులతో కూడిన తొట్టి గ్యాంగ్ విదేశీ శక్తులతో కలిసి పని చేస్తోందని, కానీ వాళ్ల కుట్రను సాగనివ్వబోనని ఇమ్రాన్ అన్నారు.  ‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నంతవరకూ మేం పాకిస్తాన్​ను క్షమించలేం” అంటూ ఒక దేశం బెదిరింపు లేఖ పంపిందన్నారు. అవిశ్వాస తీర్మానం ఫైల్ కాకముందే.. సభలో ప్రవేశపెట్టినట్లు ఆ లెటర్​లో పేర్కొన్నారని, దీన్ని బట్టి చూస్తే.. వాళ్లతో ప్రతిపక్ష నేతలు ముందునుంచే టచ్​లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం పాస్ కాకుంటే పరిణామాలు ఇంకోలా ఉంటాయని హెచ్చరిస్తూ పాకిస్తాన్ అంబాసిడర్​కు అధికారికంగానే ఆ లేఖ అదిందన్నారు. దేశ అగ్రనేతలతో చర్చించిన తర్వాతే తాను ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లానని, కానీ ఆ విదేశీ అధికారి మాత్రం అది తన సొంత నిర్ణయమని చెప్పారన్నారు. 

ఇండియాతో దోస్తీకి ప్రయత్నించిన 

మొదటినుంచీ ఇండియాతో స్నేహం చేసేందుకే తాను ప్రయత్నించానని ఇమ్రాన్ అన్నారు. ‘అమెరికా, యూరప్ లేదా ఇండియాకు వ్యతిరేకంగా ఉండటం మన పాలసీ కాదు. కానీ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, కాశ్మీర్ స్టేటస్ ను మార్చిన తర్వాతే ఇండియాకు వ్యతిరేకంగా మన పాలసీ మారింది’ అని అన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజే.. విదేశాంగ విధానం పూర్తి స్వతంత్రంగా, పాకిస్తానీల మంచి కోసమే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఇండియన్ ప్రధాని మోడీతో నేపాల్​లో సీక్రెట్ గా సమావేశం అయ్యారని, ఈ విషయాన్ని బర్ఖాదత్ తన పుస్తకంలో వెల్లడించారని ఇమ్రాన్ అన్నారు. తనను గద్దె దించేందుకు జరిగిన కుట్రకు సంబంధించిన డాక్యుమెంట్​ను కేబినెట్ కు, పార్లమెంటుకు, జర్నలిస్టులకు చూపానని ఇమ్రాన్ చెప్పారు. నిజాయతీతో ఉండే ప్రభుత్వం కావాల్నా? అవినీతి ప్రభుత్వం కావాల్నా? అన్నది ఆదివారం దేశమే నిర్ణయించుకుంటుందన్నారు.  కాగా,  గురువారం నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. కొద్ది నిమిషాలకే సభ ఆదివారానికి వాయిదా పడింది. మధ్యాహ్నం ఇమ్రాన్ అధ్యక్షతన నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) భేటీ అయింది. ఇమ్రాన్ ను గద్దె దింపాలని హెచ్చరిస్తూ లేఖ పంపిన విదేశీ అధికారికి కమిటీ గట్టిగా హెచ్చరికలు చేసినట్లు ‘జియో’ న్యూస్ వెల్లడించింది. 

పాక్ పీఎంలెవరూ ఐదేండ్లు పూర్తిచేస్కోలే   

పాకిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ గత 74 ఏండ్లలో ఏ ఒక్క ప్రధాన మంత్రి కూడా పూర్తికాలం (ఐదేండ్లు)  పదవిలో కొనసాగలేదు. ఇప్పటివరకు పాక్ కు 18 మంది ప్రధాన మంత్రులుగా పని చేశారు. వీరిలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న మూడో ప్రధాని ఇమ్రాన్ ఖాన్. గతంలో బెనజీర్ భుట్టో, షౌకత్ అజీజ్ లు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పటికీ, పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఇక మిగతా వాళ్లెవరూ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకపోయినా, ఆర్మీ తిరుగుబాట్లు, ఇతర కారణాలతో పదవీకాలం పూర్తవకుండానే గద్దె దిగిపోయారు. కేర్ టేకర్ ప్రధానులుగా ఉన్న కాలాన్ని మినహాయిస్తే ఇప్పటివరకూ పాక్ లో ఏ ఒక్క ప్రధాని కూడా ఐదేండ్లు పాలించలేదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా వీరి లిస్టులోనే చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇమ్రాన్ సర్కారు ఆల్రెడీ మైనారిటీలో పడిపోవడంతో తీర్మానంలో ఓడినా లేదా ముందస్తుకు వెళ్లినా.. పదవీకాలం పూర్తికాకుండానే గద్దెదిగినట్లు అవుతుంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే.. ఇలా పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధాని ఈయనే అవుతారు.