సుప్రీం చరిత్రలో తొలిసారి: ఒకేసారి తొమ్మిది మంది జడ్జిల ప్రమాణం

సుప్రీం చరిత్రలో తొలిసారి: ఒకేసారి తొమ్మిది మంది జడ్జిల ప్రమాణం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది జడ్జీలు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ సుప్రీం జడ్జీలుగా ప్రమాణం చేశారు. వీరిలో జిస్టిస్ హిమా కోహ్లీ మొన్నటి వరకు తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. జస్టిస్ నాగరత్న 2027 లో చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే... దేశ మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్ గా ఆమె రికార్డ్ క్రియేట్ చేస్తారు. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ తెలుగువారు కాగా... ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ గానూ పనిచేశారు.

సుప్రీంకోర్టులో ఇలా ఒకేసారి 9 మంది జడ్జీలు ప్రమాణం చేయడం చరిత్రలోనే తొలిసారి కాగా... అందులో ముగ్గురు మహిళలు ఉండడం విశేషం. అలాగే చరిత్రలో మొదటిసారి జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. గతంలో చీఫ్ జస్టిస్ కూర్చుకునే కోర్ట్ నెంబర్ వన్ లో మాత్రమే ప్రమాణ కార్యక్రమం జరిగేది. అయితే కరోనా గైడ్ లైన్స్ కారణంగా డిస్టెన్సింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని ఆడిటోరియానికి మార్చారు.