సర్ ప్లస్ ఉన్న రాష్ట్రంలో..  టైమ్​కు జీతాలు ఎందుకిస్తలేరు?

సర్ ప్లస్ ఉన్న రాష్ట్రంలో..  టైమ్​కు జీతాలు ఎందుకిస్తలేరు?

హైదరాబాద్, వెలుగు:  సర్ ప్లస్ బడ్జెట్​ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.. టీచర్లు, ఉద్యోగులకు టైమ్​కు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  రూ.60వేల కోట్లున్న అప్పు.. ఇప్పుడు రూ.5 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అప్పులను సీఎం కేసీఆర్ తన సొంత ఆస్తులను పెంచుకోవడానికి, ఇరిగేషన్​లో కమీషన్ల కోసమే కడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ పెంచి నిర్మించినా, ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం మల్కాజిగిరిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్​ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయ, అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమన్నారు. విద్యకు సరైన నిధులు ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బడుల్లో టీచర్లు లేరని, ఫెసిలిటీస్ కూడా ఉండట్లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకంగా ఉన్నారనీ, వారికి పీఆర్సీ ఇవ్వలేదనీ, ట్రాన్స్​ఫర్లు చేయడం లేదని ఆయన చెప్పారు. టీచర్లనూ డబ్బులతో కొనాలని చూస్తున్నారని, అందరూ ఆలోచించి ఓటు వేయాలని వివేక్ వెంకటస్వామి కోరారు. వచ్చే అసెంబీ ఎన్నికల్లో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని, టైమ్​కు పీఆర్సీ ప్రకటిస్తామనే అంశాలనూ మేనిఫెస్టోలో పెడ్తామని చెప్పారు.

దేశం బాగు కోసం మోడీ పనిచేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం బడ్జెట్​లో విద్యకు ఎక్కువ నిధులిచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్​ సర్కారు వస్తే జీతాలిచ్చే పరిస్థితి ఉండబోదనీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్​ రావు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన మండిపడ్డారు. మండలిలో ప్రశ్నించే గళం కోసం ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.  మరోపక్క వీ6, వెలుగు నిజాలు చూపిస్తున్నాయనే వాటిని బెదిరిస్తున్నారని రామచందర్​రావు చెప్పారు.  కేటీఆర్ ప్రస్టేషన్​లోనే వీ6, వెలుగును బెదిరించారని చెప్పారు. కేసీఆర్ సైతం గతంలో  ఓసారి మీడియాపై విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో మాజీ టీచర్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , ఇతర నేతలు  శేఖర్ యాదవ్, మహేశ్ యాదవ్, శ్రీనివాస్, నవీన్ , రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.