చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష

చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష

కొచ్చి: కేరళలో ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా చంపేసిన కేసులో దోషికి మరణ శిక్ష పడింది. బాలిక హత్య జరిగిన 110 రోజుల తర్వాత పోక్సో ప్రత్యేక కోర్టు మంగళవారం తుదితీర్పును వెల్లడించింది. బీహార్​కు చెందిన కూలి పనిచేసుకునే అశ్వక్ ఆలంను ఉరితీయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ తీర్పును హైకోర్టు ధృవీకరించిన తర్వాత అమలవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. 

జులై 28న చాక్లెట్ కొనిస్తానని చెప్పి అలువా ప్రాంతంలో ఉండే ఐదేండ్ల చిన్నారిని తీసుకెళ్లిన అశ్వక్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై గొంతునులిమి చంపేశాడు. అనంతరం డెడ్​బాడీని గోనె సంచీలో కట్టి చెత్తకుప్పలో పడేశాడు. ఈ దారుణం జరిగిన రెండు రోజుల్లోనే పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని, నిందితుడిని కనిపెట్టారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కాగా, కోర్టు తాజా తీర్పుపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. బాలల దినోత్సవంనాడు ఇచ్చిన తీర్పు.. పిల్లలపై దారుణాలకు పాల్పడేవారికి హెచ్చరిక కావాలన్నారు. ఆ బాలిక తల్లిదండ్రులకు ప్రభుత్వం మాత్రం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.