- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ స్మైల్ 2026’పై బుధవారం కలెక్టరేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 31వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నియంత్రణకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
అనంతరం ఆపరేషన్ స్మైల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఆర్డీవో గీత, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, డీఎంహెచ్‌వో రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమం సందర్శన
తంగళ్లపల్లి: చిల్డ్రన్ హోమ్భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం పనులను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వేములవాడలో నిర్వహించనున్న త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలకు వృద్ధులను తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అనంతరం వృద్ధాశ్రమ పరిసరాలు, వసతి గదులు, వంట గది, సామగ్రి పరిశీలించారు.
