బాధగా ఉంది.. కానీ చాలా సంతోషం: సుప్రియో

బాధగా ఉంది.. కానీ చాలా సంతోషం: సుప్రియో

కోల్‌కతా: కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన వార్తలపై ఆయన స్పందించారు. నిప్పు లేకుండా పొగ రాదని, తాను రాజీనామా చేసిన విషయం నిజమేనని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. మీడియా మిత్రులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, అందరి కాల్స్ ఆన్సర్ చేయలేక ఇలా సోషల్ మీడియాలో స్పందిస్తున్నట్లు చెప్పారు.  ‘‘నన్ను రాజీనామా చేయమని అడిగారు. నేను చేశాను. ఇప్పటి వరకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. నాపై ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా కేబినెట్‌ నుంచి బయటకు రావడం నాకు సంతోషంగా ఉంది. నన్ను ఎంపీగా గెలిపించిన అసన్సోల్‌ (బెంగాల్) నియోజకవర్గ ప్రజలకు థ్యాంక్స్” అని పోస్ట్ చేశారు.
బాధగా ఉంది.. కానీ చాలా సంతోషం
తాను పదవి కోల్పోయినందుకు బాధగా ఉందని, అయినా పశ్చిమ బెంగాల్‌ నుంచి కొత్తగా కేబినెట్‌లో చేరుతున్న వారి విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని బాబుల్ సుప్రియో తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్తగా కేబినెట్‌లోకి వస్తున్న కొలీగ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా మంత్రి పదవులు ఎవరికి రాబోతున్నాయో తనకు తెలిసినప్పటికీ బయటపెట్టలేనని అన్నారు.