- 10 మంది ఇంజినీర్లతో ప్రారంభించిన జీహెచ్ఎంసీ
- సమర్థవంతంగా పనిచేయని విభాగం
- ప్రైవేట్ వ్యక్తులకు డిజైన్ల పని అప్పగింత
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు జీహెచ్‌ఎంసీ హెచ్‌సిటీ, ఎస్‌ఆర్‌డీపీ పథకాల కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల ఇంజినీరింగ్ డిజైన్ల కోసం ప్రతిసారీ ప్రైవేట్ కన్సల్టెన్సీలపై ఆధారపడటం వల్ల భారీగా నిధులు ఖర్చవుతున్నాయని గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బల్దియాకు సొంతంగా డిజైన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
గత ఏడాది సెప్టెంబర్ 2న 10 మంది ఇంజనీర్లతో కూడిన ‘ఇన్ హౌస్ డిజైన్ వింగ్’ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగంలో సీనియర్ ఇంజినీర్లతో పాటు ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివిన జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లను కూడా చేర్చారు. ప్రైవేట్ కన్సల్టెంట్లపై ఆధారపడకుండా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు స్వయంగా ప్రాజెక్టుల డిజైన్లు రూపొందిస్తే ప్రజాధనం ఆదా అవడంతో పాటు పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు భావించారు.
అయితే ఇన్ హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటై నెలలు గడుస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. పైస్థాయి అధికారుల ఆశయాలు కాగితాలకే పరిమితమయ్యాయని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు సమాచారం
- విభాగం బాధ్యతలు..
ఇన్ హౌస్ డిజైన్ వింగ్‌లో ఒక సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఫీల్డ్ డివిజన్లకు అవసరమైన డిజైన్ క్లారిఫికేషన్లు సమయానికి అందించడం, సుస్థిరత, వినూత్నతతో కూడిన సాంకేతిక పరిష్కారాలను అందించడం ఈ విభాగం ప్రధాన బాధ్యతలు. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ వ్యవస్థలో స్వయం సమర్థత పెంచే దిశగా ఈ వింగ్ కీలకంగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ ఆ స్థాయిలో పనితీరు కనిపించడం లేదు.
- ఇంజినీర్ల కొరత..
ఇంజినీర్ల కొరత కూడా ఈ వింగ్ పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లపై అధిక పనిభారం ఉంది. మూడు కార్పొరేషన్లకు ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్లుగా కొనసాగుతున్న ముగ్గురు ఎస్‌ఈల్లో ఒకరు వచ్చే నెల, మరొకరు జూన్‌లో, ఇంకొకరు ఆగస్టులో రిటైర్ కానున్నారు.
ట్రై కార్పొరేషన్లలో మొత్తం 8 మంది ఎస్‌ఈలు ఉన్నప్పటికీ, వారిలో ముగ్గురు ఇన్‌చార్జ్ చీఫ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అలాగే 45 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లలో కూడా కొందరు ఇన్‌చార్జ్ ఎస్‌ఈలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొందరికి జిల్లాల బాధ్యతలతో పాటు నగర బాధ్యతలు కూడా అప్పగించడంతో సిబ్బంది కొరత మరింత పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఇన్ హౌస్ డిజైన్ వింగ్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు.
