దేశంలో ప్రతి పావు గంటకో రేప్..

దేశంలో ప్రతి పావు గంటకో రేప్..

అత్యాచారాలపై డైరెక్టర్ పూరీ స్పందన

హైదరాబాద్: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ మ్యూజింగ్స్‌‌కు మంచి పాపులారిటీ వచ్చింది. హత్రాస్, బల్‌‌రాంపూర్ గ్యాంగ్ రేప్‌‌ల నేపథ్యంలో పూరి అత్యాచారాలపై లేటెస్ట్ మ్యూజింగ్‌‌లో మాట్లాడారు. దేశంలో ప్రతి పావు గంటకో అత్యాచారం జరుగుతోందంటూ పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లకు న్యాయం జరగడం కోసం అందరూ నిలబడాలని చెప్పారు.

‘ఇండియాలో ప్రతి పావు గంటకో రేప్ జరుగుతోంది. ప్రతి రోజు వంద రేప్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. రోజుకు నాలుగు లక్షలకు పైగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. రీసెంగ్‌‌గా హత్రాస్‌‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. అత్యాచారాలు చేయడమే గాక బాధితులను హింసిస్తున్నారు, కొడుతున్నారు. శాడిజం చూపిస్తున్నారు. ఆడవాళ్లకు న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది. ఏంటీ ఖర్మ? కొంతమంది సిన్సియర్ జర్నలిస్టులు ప్రతి రోజు పోరాడుతూనే ఉన్నారు. రియల్ జర్నలిస్టులకు సెల్యూట్. అయితే ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే పోరాడుతున్నారు తప్ప మగవాళ్లు పట్టించుకోవడం లేదు. మిగిలిన మీడియా అంతా ఫెస్టివల్స్‌‌తో బిజీగా ఉంది. కొన్నాళ్లు సూసైడ్ ఫెస్టివల్. సుశాంత్ ఒక్కడే కాదు అదే టైమ్‌‌లో ఇండియాలో 300 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. గాల్వన్ వ్యాలీలో దేశం కోసం ప్రాణాలిచ్చిన సైనికుల పేర్లు ఎవ్వరికీ తెలియదు. కనీసం ఒక్కసారి ఆ మహావీరుల గురించి ఆలోచించరు కూడా. తర్వాత నెపోటిజం ఫెస్టివల్. అందరూ కలసి ఒకరిని తొక్కేస్తున్నారని తెగ ఫీలయిపోతున్నారు. అది ఫూలిష్‌‌నెస్. సుశాంత్ ఓ స్టార్. కొత్త హీరోల సినిమాలు ఎన్నో విడుదలవుతాయి. ఒక్క థియేటర్ అయినా నిండిందా? కొత్త హీరోను ప్రోత్సహిద్దామని మీరు ఎప్పుడైనా టిక్కెట్ కొన్నారా? ఆడవాళ్ల కోసం నిలబడండి. తెలంగాణలో దిశకు జరిగిన న్యాయం దేశంలోని ప్రతి అమ్మాయికీ జరగాలి. మొన్న పంద్రాగస్టున అందరం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నాం. అదే రోజు ఓ ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆ విషయం మీకెవరికైనా తెలుసా?’ అని పూరి పేర్కొన్నారు.