
- రియల్ వ్యాపారి శ్రీనివాస్‌రావును 6 గంటలు ప్రశ్నించిన ఈడీ
- ఉదయం ఇంట్లో తనిఖీలు.. అనంతరం ఈడీ ఆఫీసులో
- రాత్రి 10.30 దాకా విచారణ
- త్వరలో పలువురు లీడర్లకు నోటీసులిచ్చి విచారించే చాన్స్
- శ్రీనివాస్‌రావుకు ఓ ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతరులతో సంబంధాలు
- ఆయన కంపెనీల ద్వారానే ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు!
- ఇయ్యాల మరోసారి ఈడీ ముందుకు శ్రీనివాస్‌రావు
- రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీల ముసుగులో..
రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ కంపెనీల ముసుగులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సోమవారం సోదాల్లోనూ ఇదే విషయం వెల్లడైంది. బంజారాహిల్స్‌లోని జోనా ట్రావెల్స్, రామంతాపూర్ డీఎస్‌ఎల్ టవర్స్‌లోని సాలిగ్రామ్ కంపెనీ, మాదాపూర్‌లోని వరుణ్ సన్ కంపెనీ, మేడ్చల్ సుచిత్రలోని మరో ఐటీ కంపెనీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఇందులో డీఎస్‌ఎల్ టవర్స్‌లోని సాలిగ్రామ్‌లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఈడీ గుర్తించింది. ఇదే క్రమంలో శ్రీనివాస్ రావు పలువురు రాజకీయ నేతలకు బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇచ్చిన సమాచారంతో రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్టిబ్యూటర్స్ తోపాటు మరో 14 షెల్ కంపెనీలకు చెందిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఇటీవల సీజ్ చేసింది. వీటి ఆధారంగా మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ను ట్రేస్ చేస్తున్నది.
సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రాంచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నుంచి ఈడీ ఇప్పటికే కీలకమైన సమాచారం సేకరించింది. ఇందులో భాగంగానే సోమవారం రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాస్‌రావును బంజారాహిల్స్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకొని.. ఈడీ ఆఫీసుకు తరలించి విచారించింది. ఇప్పటివరకు మీడియా కంట పడకుండా రహస్యంగా సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీమ్‌లు.. శ్రీనివాస్‌రావును మీడియా సమక్షంలోనే సాయంత్రం 4 గంటలకు ఈడీ ఆఫీసుకు తరలించారు. రాత్రి 9.45 గంటల వరకు విచారించి వదిలిపెట్టారు. మంగళవారం కూడా విచారణకు రావాలని, ఎప్పుడు పిలిచినా హాజరుకావాల్సి ఉంటుందని ఆయనకు తేల్చిచెప్పారు. శ్రీనివాస్‌రావు స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్. సోమవారం బంజారా హిల్స్‌తోపాటు రామంతాపూర్, మాదాపూర్, కొండా పూర్, మేడ్చల్ సుచిత్రలో ఈడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐదు టీమ్స్‌లో సుమారు 50 మం దికి పైగా అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. వారికి సెక్యూరిటీగా వెంట కేంద్ర బలగాలు ఉంటున్నాయి.
రామచంద్ర పిళ్లై బ్యాంకు ట్రాన్సాక్షన్స్ సేకరిస్తుండగా..!
లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ రామచంద్ర పిళ్లైని ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఈడీ అధికారులు విచారించి.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సేకరించారు. ఈ స్కామ్‌లో మీడియేటర్స్‌గా వ్యవహరించిన ముంబైకి చెందిన సమీర్ మహేంద్రు, ఢిల్లీకి చెందిన విజయ్ నాయర్‌కు చేరిన రూ. 4 కోట్లకు సంబంధించిన వివరాలు రాబట్టారు. ఎవరి అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిందనే విషయం, నగదు రూపంలో ఇచ్చిన లంచాలకు సంబంధించి బ్యాంకు లెక్కలు సేకరించారు. ఈ క్రమంలోనే వెన్నమనేని శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ అడ్రస్ పేరుతో పలు కంపెనీలను శ్రీనివాస్‌రావు రిజిస్టర్ చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఆయా అడ్రెస్‌లతో లింకైన షెల్ కంపెనీల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తున్నది.
వరుసగా తనిఖీలు
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రాంచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు. ఆయన రాబిన్ డిస్టిలరీ, డిస్టిబ్యూషన్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. లిక్కర్ బిజినెస్‌లో రాంచంద్ర పిళ్లైకి రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ కేసులో ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో ఈడీ సోదాలు జరుపుతున్నది. దోమలగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, అంబర్‌పేట్. డీడీ కాలనీతో పాటు దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. గోరంట్ల బుచ్చిబాబు అండ్ అసోసియేట్స్ సంస్థ ప్రముఖ లిక్కర్, స్పిరిట్ కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓ ప్రముఖ నేతకు చెందిన కంపెనీలకు గోరంట్ల బుచ్చిబాబు సీఏగా పనిచేసినట్లు సమాచారం. రాబిన్ డిస్టిలరీస్ అడ్రస్ పేరులో రిజిస్టర్ అయిన అనూస్ బ్యూటీ పార్లర్ డైరెక్టర్‌గా బోయినపల్లి అభిషేక్‌రావు ఆర్‌ఓసీ రికార్డుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే మాదాపూర్ అలేఖ్య ప్రణవ్‌హోమ్స్‌లోని అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్, రాయదుర్గంలోని అభిషేక్‌రావు ఆఫీస్, నానక్‌రాంగూడకు చెందిన ప్రేమ్ సాగర్‌రావు ఆఫీసుల్లో సోదాలు జరిపింది.
సీఏ బుచ్చిబాబు లెక్కల్లో షెల్ కంపెనీల గుట్టు
దోమలగూడలోని చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీస్, ఇండ్లలో నాలుగురోజుల కింద 23 గంటలపాటు జరిపిన సోదాల్లో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. బుచ్చిబాబు ఆఫీస్, సిబ్బంది ఇండ్లలో హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్ టాప్స్, పలు కంపెనీలకు చెందిన డాక్యుమెంట్స్, ఇన్ కమ్ ట్యాక్స్ షీట్స్, బ్యాంక్ అకౌంట్స్‌కు సంబం ధించిన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. గోరంట్లతో పాటు ఆఫీస్ సిబ్బంది స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసింది. రాబిన్ డిస్టిలరీస్, అనూస్ బ్యూటీ పార్లర్స్ సహా పలు లిక్కర్ డీలర్స్‌కు చెందిన అకౌంట్స్‌ను గుర్తించింది. డిజిటల్, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌తో బినామీ అకౌంట్స్, షెల్ కంపెనీల ఆధారాలు సేకరించింది. హైదరాబాద్, కర్నాటక, ఏపీలో రిజిస్టరైన కంపెనీల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. గోరంట్ల అండ్ అసోసియేట్స్ సంస్థకు చెందిన సీఏలు, ఆడిటర్స్ నిర్వహించిన ఫైనాన్సియల్ డేటాతో ఆది, సోమవారం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకొని ఆరుగంటల పాటు విచారించింది.
రాజకీయ ప్రముఖులతో శ్రీనివాస్‌రావు
రాబిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో బెంగళూరుకు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్‌సాగర్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. వీరిలో ప్రేమ్‌సాగర్‌కు వెన్నమనేని శ్రీనివాస్ రావు సమీప బంధువు. శ్రీనివాస్‌రావు రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీస్ నిర్వహిస్తున్నారు. ఆయనకు పలువురు రాజకీయ నేతలతో అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ రావును ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత.. పలువురు రాజకీయ ప్రముఖులతో కలిసి ఆయన ఉన్న పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీనివాస్ రావు నుంచి పూర్తి వివరాలు రాబట్టాక ఈడీ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్న వారికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.