జగిత్యాల, కరీంనగర్​, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ డెలివరీలు ప్రైవేట్లనే

జగిత్యాల, కరీంనగర్​, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ డెలివరీలు ప్రైవేట్లనే
  • నల్గొండ, రంగారెడ్డి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లే: మంత్రి హరీశ్​ రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేసే విషయంలో గత నెల(డిసెంబరు)లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. ఈ జిల్లాలో అత్యధికంగా 86 శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ప్రసవాలు ఎక్కువగా ప్రైవేటు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయని చెప్పారు. అక్కడి డీఎంహెచ్‌‌‌‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోలు క్షేత్ర స్థాయి పర్యటన చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు పెరిగేలా చూడాలన్నారు.

నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ డెలివరీలే జరుగుతున్నాయని, దీనిపై పరిశీలన చేయాలన్నారు. ‘కంటి వెలుగు’ రెండో దశ కార్యక్రమంపై ఆశాలు, ఏఎన్‌‌‌‌ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, డీఎంహెచ్‌‌‌‌వోలతో మంత్రి హరీశ్​ రావు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో గత మూడు నెలల్లో నమోదైన ఓపీని పరిశీలిస్తే.. రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓపీని నమోదు చేస్తున్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కుమ్రంభీం, జనగాం జిల్లాల్లో పరిస్థితులు మారాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.