జన్నారం, వెలుగు : ఇద్దరు వృద్ధులను నమ్మించి రూ.18 వేలు కాజేసిన ఘటన జన్నారం మండలంలోని తిమ్మాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన సామల బుచ్చయ్య, రాజవ్వ ఇంటికి ఆదివారం ఇద్దరు దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చారు. వారి ఇంటి పక్కనే కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్న రాజేందర్‌కు ఇటుక వేశామని, ఆయన రూ.20 వేలు ఇమ్మనాడని నమ్మ బలికారు.
రూ.2 లక్షలు డ్రా చేయడానికి రాజేందర్ బ్యాంక్‌కు వెళ్లాడని.. వచ్చాక మీ డబ్బులు ఇస్తాడని చెప్పారు. రాజేందర్ మాదిరిగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడించారు. ఇదంతా నమ్మిన వృద్ధులు వారికి రూ.18 వేలు ఇచ్చి పంపారు. ఆ తర్వాత రాజేందర్‌ను సంప్రదించగా, వారేవరో తనకు తెలియదని అసలు బ్యాంక్ కే వెళ్లలేదని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.