ఖమ్మం జిల్లాలో 42 శాతం చెరువుల్లోనే చేప పిల్లల విడుదల

ఖమ్మం జిల్లాలో 42 శాతం చెరువుల్లోనే  చేప పిల్లల విడుదల

 ఆలస్యంతో మత్స్యకారులకు నష్టం
   నగదు బదిలీ చేయాలని డిమాండ్


ఖమ్మం, వెలుగు: ఉచిత చేప పిల్లల విడుదల ప్రక్రియ ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. నవంబర్  మొదటివారం ముగిసినా ఇప్పటి వరకు 42 శాతం చెరువుల్లో మాత్రమే పిల్లలను వదిలారు. 1129 చెరువులు, 4 రిజర్వాయర్లలో కలిపి ఈ ఏడాది రూ.2.71 కోట్లతో 3.62 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటి వరకు 475 చెరువుల్లో 1.25 కోట్ల చేప పిల్లలను మాత్రమే విడుదల చేశారు. మిగిలిన వాటిల్లో త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆలస్యం చేయడంతో తమకు నష్టం జరుగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ఎండాకాలంలో చేపలు పట్టే సమయానికి ఒక్కో పిల్ల కనీసం అర కేజీ బరువు కూడా పెరగదని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. 

కాంట్రాక్టర్ల దగా..

చేప పిల్లల సప్లై చేసే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ ను పక్కన పెడుతున్నారనే విమర్శలున్నాయి. పిల్లల సైజు, లెక్క విషయంలో కాంట్రాక్టర్లు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారికి అధికారులు కూడా సపోర్టు చేస్తున్నారని అంటున్నారు.  మూడు నెలల క్రితం రఘునాథపాలెం మండలం కోటపాడు చెరువులో చేప పిల్లలను విడిచే సమయంలో కలెక్టర్ వీపీ గౌతమ్ కు పిల్లల సంఖ్యపై అనుమానం కలిగింది. అధికారులను అడిగితే ప్రతి పెట్టెలో 5 వేల పిల్లల చొప్పున ఉంటాయని చెప్పగా, వాటిని లెక్కించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో 80 వేల పిల్లల్లో పది శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో  మత్స్యశాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్కువ వచ్చిన చేప పిల్లలను రెండ్రోజుల్లో తెచ్చి చెరువులో విడిచి పెట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోల సమక్షంలో సొసైటీ బాధ్యులతో చేప పిల్లల సైజు, పరిమాణం ఆర్డర్ ప్రకారం ఉన్నది లేనిది తనిఖీ చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయించాలని ఆర్డర్ వేశారు. ఇక ఇటీవల చెరువుల్లో వేసేందుకు తెచ్చిన 20 లక్షల పిల్లలు ఆఫీసర్లు చెప్పిన 0.35 మిల్లీమీటర్ల కంటే సైజు తక్కువ ఉండడంతో వాటిని రిజెక్ట్ చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్  భావిస్తున్నా క్షేత్రస్థాయిలో మోసాలు ఆగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 

నగదు బదిలీ చేయాలె..

ప్రతి ఏటా చేప పిల్లల విడుదలలో ఆలస్యంపై మత్స్యకార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ విధానాన్ని తీసుకువచ్చినట్లుగానే చేప పిల్లలు కాకుండా వాటికి అయ్యే ఖర్చును మత్స్యకార సంఘాలకే అందించాలని అంటున్నారు. మత్స్యకారులే నాణ్యమైన పిల్లలను కొనుక్కొని తెచ్చుకుంటారని చెబుతున్నారు. 

సకాలంలో సప్లై చేయాలి

ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే లాభం ఉంటుంది. ఆగస్టు నెలలో ఇవ్వాల్సిన చేప పిల్లలను ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. పిల్లలు చిన్న సైజులో ఉన్నందున వాటిని పెద్ద చేపలు తింటాయి. మత్స్య సహకార సంఘాలకు నగదు బదిలీ చేస్తే ఆ డబ్బుతో సకాలంలో చేప పిల్లలు పోసుకుంటాం.

- చింతల సంపత్, మత్స్యకారుడు, కారేపల్లి

నెలాఖరులోగా కంప్లీట్ చేస్తాం

వివిధ కారణాలతో చేప పిల్లల విడుదలలో జాప్యం జరిగింది. ఈ నెలాఖరులోగా అన్ని చెరువుల్లో పిల్లలను విడుదల చేస్తాం. ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న పిల్లలను చెరువుల్లో విడుదల చేస్తాం.

- ఆంజనేయస్వామి, ఫిషరీస్​ ఆఫీసర్​