కొమురవెల్లి మల్లన్న ఆలయంలో..హుండీలు నిండిపోయినా కొత్తవి పెట్టలే

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో..హుండీలు నిండిపోయినా కొత్తవి పెట్టలే
  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

సిద్దిపేట, వెలుగు :  పట్నం వారం సందర్భంగా తరలివస్తున్న భక్తుల కానుకలతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ హుండీలు నిండిపోతున్నాయి. కరెన్సీ నోట్లు పైకి కనిపిస్తున్నా అధికారులు వాటిని మార్చే ప్రయత్నం చేయడం లేదు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేదు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం మల్లన్న ఆలయ గర్భగుడిలోని మూడు, అర్ధమండపంలోని ఆరు హుండీలు నిండి కరెన్సీ నోట్లు బయటకు కనిపించాయి. ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పట్నం వారం సందర్భంగా ఇప్పటివరకు దాదాపు లక్ష మంది భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. హుండీలలో భారీగా కానుకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

హుండీలు నిండి కరెన్సీ నోట్లు పైకి కనిపిస్తున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నెల 7వ తేదీన జరిగిన మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం తర్వాత హండీలను లెక్కించాలి. కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు. దీంతోనే హుండీలు కానుకలతో నిండిపోయాయి. ఏవరైనా భక్తులు ప్రశ్నిస్తే అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది లోపలికి కుక్కుతున్నారే తప్ప, హుండీలను మార్చడం లేదు. గతంలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ విషయమై ‘వెలుగు’ ప్రతినిధి ఆలయ ఈఓ బాలాజీని వివరణ కోరే ప్రయత్నం చేయగా, అందుబాటులోకి రాలేదు.