మహబూబ్​నగర్ లో ఆఫీసర్ల నిర్లక్ష్యంపై హాట్​ హాట్​గా సాగిన మీటింగ్

మహబూబ్​నగర్ లో ఆఫీసర్ల నిర్లక్ష్యంపై హాట్​ హాట్​గా సాగిన మీటింగ్
  • జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్​ సీరియస్
  • ‘మిషన్​ భగీరథ’ సమస్యలపై సభ్యుల  ప్రశ్నల వర్షం
  • కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు ఇబ్బంది పెడుతున్రని మండిపాటు

మహబూబ్​నగర్​, వెలుగు : ‘జడ్పీ మీటింగ్​కు ఆరుగురు జిల్లా ముఖ్య అధికారులు హాజరు కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు.. చిన్న పిల్లల  వలె చెప్పించుకోకండి. పదిన్నరకు మీటింగ్​అంటే పది నిమిషాల ముందే  రావాలి. 11.30 అవుతున్నా, ఇంకా ఒక్కొక్కరు  వస్తే ఎట్లా? అని కలెక్టర్​ ఎస్​.వెంకట్రావు జిల్లా అధికారుల తీరుపై సీరియస్​అయ్యారు. మహబూబ్​నగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం  గురువారం జడ్పీ మీటింగ్​హాల్​లో హాట్​హాట్​గా సాగింది.  చైర్​పర్సన్​ స్వర్ణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ  సమావేశానికి  కలెక్టర్​తో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, జడ్పీ సీఈవో జ్యోతి హాజరయ్యారు. 

మిషన్ ​భగీరథ పనులపై గరం గరం..

సభలో  ‘మిషన్​ భగీరథ’ పనులపై చిన్నచింతకుంట, గండీడ్​, మూసాపేట, బాలానగర్, దేవరకద్ర, జడ్చర్ల మండలాల సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్​ మండలంలోని బోయిన్​పల్లి, బోయిన్​పల్లి తండా, లింగాయిపల్లి, ఈర్ల బండ తండాలో  నీళ్లు సరిగ్గా రావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని మండలాల్లో 3 నెలలుగా నీళ్లు వస్తలేవని  చెప్పారు. చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో వరదల వల్ల పైపులైన్​కొట్టుకుపోయిందన్నారు.  కొన్ని చోట్ల గేట్​ వాల్వ్​లు చెరువుల్లో ఉన్నాయని, చెరువుల్లో మురుగు నీరు కలుస్తుండటంతో  నీరు కలుషితమవుతోందని చెప్పారు.  బాలానగర్ మండల కేంద్రంలో జనాభా పెరిగిందని అందుకు తగ్గట్లు నీళ్లు వస్తలేవన్నారు. దేవరకద్ర మండలంలో 4 గ్రామాల్లోనే నల్లాలు ఫిట్​ చేశారని, మిగతా గ్రామాల్లో పైపులు వేసి వదిలేశారని  వాపోయారు.  మాచారం, పోలేపల్లి, అక్కడి గురుకుల స్కూల్​లో760 మంది స్టూడెంట్లు 
ఉన్నారని, బీపీడీ కాలేజ్, జూనియర్​కాలేజీలకు కూడా నేటికీ భగీరథ నీళ్లు వస్తలేవని సభ్యులు మండిపడ్డారు.

రైతు బీమా పైసలు ఎందుకొస్తలేవ్​?

రైతు బీమా పైసలు బాధిత రైతు కుటుంబాలకు ఏడాదిగా వస్తలేవని సభ్యులు అగ్రికల్చర్​ఆఫీసర్​పై ఫైర్​అయ్యారు. నిరుడు 19 మందికి ఇంకా పైసలు ఇవ్వలేదని, ఈ ఏడాది కూడా చనిపోయిన కొందరికి  డబ్బులు క్లెయిమ్​కాలేదని చెప్పారు. దీనిపై అగ్రికల్చర్​ ఆఫీసర్లను అడిగితే, సమాధానం చెప్పడం లేదన్నారు.  రైతుబంధు పైసలు రాక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, త్వరగా ఆ డబ్బులు బాధిత కుటుంబాలకు వచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

నీళ్లు, కరెంటు, డ్రైనేజీలు లేవు..

డబుల్​బెడ్​ రూమ్​ల వద్ద ఎలాంటి సౌలత్​లు లేవని సభ్యులు ఆఫీసర్లపై మండిపడ్డారు. జిల్లాలోని ముచ్చింతల, కురుమూర్తి, నిజాలాపూర్​ గ్రామాల్లో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఓపెన్​ చేసినా, సౌలత్​లు లేక వాటిలో ఎవరూ ఉండట్లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. కరెంటు, నీళ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కేటాయించినా, ఖాళీగా ఉంటున్నాయని వాపోయారు. కలెక్టర్​ నుంచి ఆర్డర్లు వస్తేనే పనులు స్టార్ట్​ చేస్తామని  ఆఫీసర్లు చెబుతున్నారని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. 

కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు   

ఒక్కో చోట ఒక్కో కూలీ రేట్​ నిర్ణయించారని, దాని ప్రకారం రైతుల నుంచి వసూలు చేస్తున్నారని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. జిల్లాలోని అన్ని సెంటర్ల వద్ద హమాలీలకు ఒకే యూనిఫాంగా రేట్​ ఫిక్స్​ చేయాలని కోరారు. జిల్లాలో ఆయిల్​పామ్​సాగుపై  రైతులకు ఇంకా అవగాహన కల్పించడంలో ఆఫీసర్లు ఫెయిల్​అవుతున్నారని కొందరు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.  సభ్యులు లేవనెత్తిన సమస్యలపై కలెక్టర్​ మాట్లాడుతూ సంబంధిత శాఖల ఆఫీసర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.