క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో..15 మందిని చంపేసిండు!

క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో..15 మందిని చంపేసిండు!
  • నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి
  • ఐదేండ్లుగా కొనసాగుతున్న హత్యలు
  • తన భర్త మిస్సింగ్‌‌పై నవంబర్‌‌‌‌లో ఓ బాధితురాలి ఫిర్యాదు
  • సత్యం యాదవ్‌‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు
  • తానే చంపినట్లు ఒప్పుకున్న నిందితుడు!

నాగర్ కర్నూల్/ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గుప్త నిధుల పేరుతో నమ్మించాడు.. క్షుద్రపూజలు చేసి ఆరోగ్యాలను బాగుచేస్తానని మోసం చేశాడు.. బాధితుల నుంచి లక్షలకు లక్షలు కాజేసి చంపుకుంటూ పోయాడు. ఐదేండ్ల కాలంలో ఏకంగా 15 మందిని హత్య చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతున్నది. తన భర్త మిస్సింగ్‌‌పై ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉండగా.. మంగళవారం అరెస్టును చూపే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ కేసు దర్యాప్తును నాగర్​కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షిస్తున్నారు.

ఒంటరిగా రావాలని, ఎవరికీ చెప్పొద్దని.. 

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దాపూర్‌‌‌‌కు చెందిన రామాటి సత్యం యాదవ్ (53).. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డాడు. హైదరాబాద్‌‌లోని లంగర్‌‌‌‌హౌస్ ఏరియాలో ఉంటున్న వెంకటేశ్‌‌తో పరిచయం పెంచుకున్నాడు. గత అక్టోబర్ చివరి వారంలో రంగారెడ్డి జిల్లా ఘట్‌‌కేసర్ ప్రాంతానికి వెంకటేశ్‌‌ను పిలిపించాడు. క్షుద్రపూజలు చేయాల్సి ఉందని, వచ్చే ముందు కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌‌కు చెప్పొద్దన్నాడు.

అయితే అనుమానం వ్యక్తం చేసిన వెంకటేశ్ తాను వెళ్తున్న చోటు, వివరాలు భార్యకు చెప్పాడు. మూడు రోజుల వరకు పూజల్లో ఉంటానని, సెల్​ఫోన్ కూడా అందుబాటులో ఉండదని చెప్పి వెళ్లిపోయాడు. మూడు రోజుల్లో వస్తానన్న భర్త నెలరోజులైనా తిరిగి రాకపోవడంతో నవంబర్ 26న నాగర్ కర్నూల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు సత్యం యాదవ్‌‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ క్రమంలో 2018 నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్‌‌తోపాటు 15 మందిని హత్య చేసిన విషయాన్ని సత్యం ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇందులో 11 మంది వివరాలు పోలీసులకు చెప్పాడని, 8 మంది వివరాలు తెలిశాయని సమాచారం. మిగతా వారి వివరాలను కనుక్కొనే పనిలో పోలీసులు ఉన్నారు.

ప్లాట్లు, భూములనూ రాయించుకుని..

సత్యం యాదవ్.. గుప్త నిధులపై ఆశతో క్షుద్రపూజలు చేసి మనుషులను బలి ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులకు కూడా గుప్త నిధుల పేరిట ఎరవేసేవాడని చెప్తున్నారు. ‘మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసి వాటిని బయటకి తీస్తా. మీ ఇంటిని ఆవహించిన దుష్టశక్తులను వెళ్లగొట్టి ఆరోగ్యాలు బాగుచేస్తా’ అని నమ్మించేవాడు.

ముందు లక్షలకు లక్షలు డబ్బులు గుంజేవాడు. నగదు అయిపోయాక ప్లాట్లు, భూములను తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు. తాను చేసే క్షుద్ర పూజల వివరాలను ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా రావాలని కండీషన్ పెట్టేవాడు. మొదట వారి కండ్లల్లో యాసిడ్ లేదంటే బంగారం కరిగించే తేజాప్ పోసి చూపు పోగొట్టేవాడు. తర్వాత వారిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేసేవాడు.

ఒకే కుటుంబంలో నలుగురి హత్య

2020లో నాగర్​కర్నూల్ లోని​17వ వార్డు నుంచి ఇండిపెండెంట్​గా సత్యం యాదవ్ పోటీ చేసి ఓడిపోయాడు. అప్పట్లో సత్యం యాదవ్​కు మద్దతుగా నౌసీన్ అనే మహిళ ప్రచారంలో పాల్గొంది. ఈ క్రమంలో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్​పూర్​లో ఉండే తన అక్క ఆస్మా బేగం(32) కుటుంబంలో అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమకు సాయం చేయాలని నౌసీన్ కోరింది.

ఆ తర్వాత ఆస్మాబేగం ఇంట్లో సత్యం యాదవ్​ క్షుద్రపూజలు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో 2020 ఆగస్టు 14న నాగ్​పూర్​లో అజ్మీరా బేగం (65,) ఆస్మా బేగం, ఖాజా(35), అస్రీన్ (10) హత్యకు గురయ్యారు. కుటుంబ వివాదం వల్లే ఈ హత్యలు జరిగాయని భావించిన పోలీసులు వారి బంధువుల విచారించారు. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఈ హత్యలను తానే చేశానని పోలీసుల దర్యాప్తులో సత్యం ఒప్పుకున్నట్లు తెలిసింది.

నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన మేస్త్రి లింగస్వామి(60)ని, కోడేరు మండల తీగలపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి, ఆయన కూతురిని సైతం తానే చంపేసినట్లు సత్యం యాదవ్​అంగీకరించినట్లు సమాచారం. మేస్త్రి లింగస్వామి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, అతని పేరిట ఉన్న ప్లాట్​ సత్యం యాదవ్​పేరుపై రిజిస్టేషన్ కావడంతో లింగస్వామి కొడుకులు అప్పటి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

చివరికి ఆ ప్లాట్​ను లింగస్వామి కొడుకుల పేరిట తిరిగి రిజిస్ట్రేషన్ చేసిన సత్యం యాదవ్.. ఈ కేసు నుంచి బయటపడినట్లు తెలిసింది.

హత్యలు చేసింది నిజమైతే ఉరివేయండి

మాకు పెండ్లయి 20 ఏండ్లయింది. పాతింట్లో తరుచూ పూజలు చేసేవాడు. ఎవరెవరో వచ్చి కలిసిపోయేవాళ్లు. నన్ను, నా ఇద్దరు కొడుకులను వేరే ఇంట్లో ఉంచాడు. అడిగితే కొట్టేవాడు. చాలా మందిని చంపిండని ఎవరెవరో వచ్చి అడుగుతు న్నరు. పోయిన మంగళవారం పోలీసులు వచ్చి తీసుకుపోయారు. ఆ తర్వాత మమ్మల్ని కలవలేదు. హత్యలు చేసింది నిజమైతే అతడిని ఉరి తీసి చంపండి.
- సుజాత, సత్యం యాదవ్ భార్య