ఫ్రీ కరెంట్.. పాత బిల్లుల మాఫీ

ఫ్రీ కరెంట్.. పాత బిల్లుల మాఫీ

పంజాబ్ ఎన్నికల హామీలు ప్రకటించిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్

చండీగఢ్: వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫ్రీ కరెంట్ హామీని ప్రకటించింది. తమ పార్టీని గెలిపిస్తే 300 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే ప్రజలు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సప్లైతో పాటు పెండింగ్ కరెంట్ బిల్లుల మాఫీ హామీలను ఇచ్చారు. ఈ హామీలను తమ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని అన్నారు. ‘‘ఇది కేజ్రీవాల్ మాట. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (కాంగ్రెస్) హామీలు కాదు. మా వాగ్దానాలను కచ్చితంగా నెరవేరుస్తాం. ఐదేండ్లుగా కెప్టెన్ తన హామీలను నిలబెట్టుకోలేదు’’ అని చెప్పారు. మంగళవారం పంజాబ్ లో పర్యటించిన కేజ్రీవాల్ చండీగఢ్ లోని పంజాబ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో అవసరానికి మించి కరెంట్ ఉత్పత్తి అవుతున్నా.. పవర్ బిల్లులు ఎక్కువగా ఉన్నాయని, గంటల కొద్దీ కరెంట్ కోతలు ఉన్నాయని అన్నారు. ఇంటి ఖర్చులో దాదాపు సగం వరకు కరెంట్ బిల్లుకే అవుతోందని కొందరు మహిళలు చెబుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. రెండు లైట్లు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికే నెలలో రూ.50 వేల బిల్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయని, ఇలాంటి తప్పులను కూడా తమ ప్రభుత్వం వస్తే సరిదిద్దుతామని, ఇందుకోసం అన్ని పెండింగ్ బిల్లులను రద్దు చేస్తామని ప్రకటించారు. ‘మేం అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు కరెంట్ వాడుకునే ఏ ఒక్క కుటుంబమూ బిల్ కట్టాల్సిన పని లేదు. దీని ద్వారా రాష్ట్రంలో 77 నుంచి 80 శాతం ప్రజలకు ఫ్రీ కరెంట్ వచ్చినట్టే’ అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో తాము అధికారంలోకి రాకముందు విద్యుత్ బిల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. తర్వాత విద్యుత్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఢిల్లీలో ఇప్పుడు 24 గంటల పాటు తక్కువ రేటుకు విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ఇదే విధానాన్ని పంజాబ్ లోనూ అమలు చేస్తామన్నారు.