అదానీ పవర్​ ప్రాఫిట్​ డౌన్

అదానీ పవర్​ ప్రాఫిట్​ డౌన్

క్యూ 3 లో రూ. 8.77 కోట్లే

న్యూఢిల్లీ : డిసెంబర్​ 2022 తో ముగిసిన క్యూ 3 లో అదానీ పవర్​ నికర లాభం 96 శాతం తగ్గి రూ. 8.77 కోట్లకు పరిమితమైంది. ఖర్చులు ఎక్కువవడం వల్లే లాభాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో అదానీ పవర్​కు రూ. 218.49 కోట్ల లాభం వచ్చింది. తాజా  క్యూ 3 లో రెవెన్యూ రూ. 8,290.21 కోట్లకు పెరిగినప్పటికీ, ఖర్చులు భారీగా రూ. 8,078.31 కోట్లకు చేరడంతో నికర లాభం తగ్గిపోయినట్లు అదానీ పవర్​ బీఎస్​ఈ ఫైలింగ్​లో వెల్లడించింది. డిసెంబర్​ 2022 క్వార్టర్లో తమ కంపెనీ, సబ్సిడరీలు కలిపి 42.1 శాతం ఏవరేజ్​ ప్లాంట్​ లోడ్​ ఫ్యాక్టర్​ సాధించినట్లు వివరించింది. ఇదే కాలానికి 11.8 బిలియన్​ యూనిట్ల కరెంటు అమ్మినట్లు పేర్కొంది. మార్చి 2022 లో చేజిక్కించుకున్న మహాన్​ ఎనర్జెన్​ లిమిటెడ్​ 1200 మెగావాట్ల రిజల్ట్స్​ కూడా తాజా క్యూ 3 లో కలిసే ఉన్నట్లు వివరించింది. బొగ్గు దిగుమతి బాగా ఖరీదైందని, దేశీయంగా ఫ్యూయెల్​ దొరకడం లేదని అదానీ పవర్​ తెలిపింది. గ్రీన్​ఫీల్డ్స్​ పవర్​ ప్రాజెక్టుల ఏర్పాటు, నిర్వహణలో అదానీ పవర్​కు మెరుగైన రికార్డు ఉందని, ఖాయిలా పడిన పవర్​ ప్లాంట్లను కొనుగోలు చేసి వాటిని టర్న్​ అరౌండ్​ చేయడంలోనూ తమకు నైపుణ్యం ఉందని అదానీ పవర్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అనిల్​ సర్దానా చెప్పారు. రెగ్యులేటరీ సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడంతోపాటు, తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల గ్రోత్​ మెరుగ్గానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆరు సబ్సిడరీలను అదానీ పవర్​లో విలీనం​ చేసే ప్రపోజల్​కు సెక్యూర్డ్​ క్రెడిటార్ల నుంచి అనుమతి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాసెస్​ పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది.

అదానీ విల్​మార్​ లాభం రూ. 246.11 కోట్లు

ఎడిబుల్​ ఆయిల్​ రంగంలోని అదానీ విల్​మార్ లాభం​ క్యూ 3 లో 15 శాతం పెరిగి రూ. 246.11 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 3 లో కంపెనీ లాభం రూ. 211.41 కోట్లు మాత్రమే. తాజా క్యూ 3 లో రెవెన్యూ కూడా రూ. 15,515.55 కోట్లకు ఎగసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. కాకపోతే డిసెంబర్​ 2022 తో ముగిసిన 9 నెలల కాలానికి చూస్తే కంపెనీ నికర లాభం తగ్గిపోయింది. 9 నెలల కాలంలో కంపెనీకి రూ. 44,501.14 కోట్ల రెవెన్యూపై రూ. 488.51 కోట్ల లాభం వచ్చింది. ఫార్చూన్​ బ్రాండ్​ పేరుతో  వంట నూనెలతో పాటు మరికొన్ని ఫుడ్​ ప్రొడక్టులను ఈ కంపెనీ అమ్ముతోంది.

అదానీ ​హైడ్రోజన్​ పార్టనర్షిప్ ​ఆగింది

అదానీ గ్రూప్​ తలపెట్టిన 50 బిలియన్​ డాలర్ల హైడ్రోజన్​ ప్రాజెక్టు పార్టనర్షిప్​ను హోల్డ్​లో పెడుతున్నట్లు ఫ్రాన్స్​ కంపెనీ టోటల్​ ఎనర్జీస్​ ప్రకటించింది. యూఎస్​ షార్ట్​ సెల్లర్​ ఆరోపణల నేపథ్యంలోనే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ కంపెనీ​ వెల్లడించింది. కిందటేడాది జూన్​లోనే చేతులు కలుపుతున్నట్లు ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి. కానీ, కాంట్రాక్టుపై టోటల్​ ఎనర్జీస్​ ఇంకా సంతకాలు చేయలేదని ఆ కంపెనీ సీఈఓ ప్యాట్రిక్​ పౌయాన్​ ఎర్నింగ్స్​ కాల్​లో తెలిపారు. జూన్​ 2022 చేసిన ప్రకటన ప్రకారం అదానీ హైడ్రోజన్​ ప్రాజెక్టులో 25 శాతం వాటా తీసుకోవడానికి టోటల్​ ఎనర్జీస్​ ఆసక్తి చూపించింది. క్లారిటీ వచ్చే దాకా ఈ ప్రాజెక్టును హోల్డ్​లో పెడుతున్నట్లు సీఈఓ తాజాగా వెల్లడించారు.