ఇంటికిద్దరు మంచం పట్టిన్రు 

ఇంటికిద్దరు మంచం పట్టిన్రు 
  • 7 వేల మందికి విషజ్వరాలు 
  • రోజూ 400 వైరల్ ​ఫీవర్ కేసులు  
  • దవాఖాన్లకు జనం క్యూ
  • వరదల తర్వాత పారిశుధ్య లోపంతోనే విషజ్వరాలు 

భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు.. లేదంటే కుటుంబానికి కుటుంబమే మంచంపట్టారు. మలేరియా, డెంగీతోపాటు పెద్దసంఖ్యలో వైరల్ ​ఫీవర్ ​వ్యాప్తి చెందుతోంది.  అధికారికంగా ఇప్పటివరకు 7 వేల మంది వైరల్​ఫీవర్ బారిన పడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. గోదావరి వరదలు తగ్గగానే శానిటేషన్​పేరిట కొంత హడావిడి చేసిన ఆఫీసర్లు తర్వాత పట్టించుకోలేదు. దీంతో భయపడ్డట్టే విషజ్వరాలు వణికిస్తున్నాయి. విపరీతమైన చలి, దగ్గు, ఒంటి నొప్పులతో జ్వరాలు వస్తున్నట్లు బాధితులు చెప్తున్నారు. వరదల తర్వాత అన్ని గ్రామాల్లో పెట్టిన మెడికల్​క్యాంపులను కొద్దిరోజులకే ఎత్తేశారు. కొన్నిచోట్ల మెడికల్ క్యాంపులు రన్ అవుతున్నా కేవలం పారసిటమాల్​లాంటి ఒకటి, రెండు టాబ్లెట్లు మాత్రమే ఇస్తున్నారు. వాటితో జ్వరం తగ్గకపోవడంతో సర్కారు ఆస్పత్రులు, పీహెచ్ సీలకు క్యూ కడ్తున్నారు. అక్కడికి కెళ్లినా తగ్గని కొందరు అప్పులు చేసి మరీ ప్రైవేటు దవాఖానాలకు వెళ్తున్నారు.  



7 మండలాల్లోని119 ఊర్లలో..  
కూనవరం మండలం రేపాకకు చెందిన సోయం బుజ్జి కుటుంబంలోని ముగ్గురు డెంగీతో బాధపడుతున్నారు. బుజ్జి, అతని భార్యగౌరి, కూతురు సుజిత భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో డెంగీ ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. జర్వాలతో బాధపడ్తున్న భద్రాచలంలోని బీసీ హాస్టల్ స్టూడెంట్లను కూడా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోదావరి వరద ముంపునకు గురైన 7 మండలాల పరిధిలోని119 గ్రామాల్లో దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.  

పారిశుధ్యాన్ని పట్టించుకోనందుకే..  
వరద ముంపు గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. వరదలు తగ్గిన ఒకటి, రెండు రోజులు శానిటేషన్ చేయించిన ఆఫీసర్లు తర్వాత పత్తాలేకుండా పోయారు. రోడ్ల మీది బురదను రోడ్లపక్కకు ఊడ్చి వెళ్లడంతో తిరిగి వర్షాలు పడి రోడ్లు మళ్లీ బురదమయం అయ్యాయి. దీంతో దోమలు పెరిగి, మలేరియా, డెంగీ వ్యాపిస్తున్నాయి. ఈ సీజన్​లో జిల్లాలో166 మలేరియా, 57 డెంగీ కేసులు నమోదైనట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇందులో వరదల తర్వాత 61 మలేరియా కేసులు 33 డెంగీ కేసులు వచ్చాయి. ఈ సీజన్​లో ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఫీషియల్​గా 7 వేలకు పైగా ఫీవర్ కేసులు వచ్చాయంటున్నారు.   

అన్ని వార్డుల్లోనూ జ్వర బాధితులే 
జిల్లాలోని సబ్ సెంటర్లు, పీహెచ్​సీల పరిధిలో జ్వరా ల తీవ్రత పెరుగుతోందని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ హన్మంతు తెలిపారు. నిజానికి ఏటా వానాకాలంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. ఈసారి గోదావరి ముంపు గ్రామాల్లో జ్వరా లు విజృంభిస్తుండడంతో రోగుల తాకిడి పెరిగింది. దీంతో ఒక వార్డు సరిపోక.. అన్ని  వార్డులనూ విష జ్వరాలతో వచ్చేవారికి కేటాయించారు. ఏపీలో విలీనమైన మండలాలకు చెందిన రోగులు ఇక్కడికే వస్తున్నారని సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.  

హెల్త్ క్యాంపులు పెట్టాలె 
గోదావరి వరదలు తగ్గిన తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ 119 ముంపు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. డీఎం అండ్​హెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. జ్వరం లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేశారు. తర్వాత మెడికల్​క్యాంపులు ఎత్తేశారు. దీంతో వారం రోజుల నుంచి విషజ్వరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. మోరంపల్లి బంజరలో ఇంటికి ఇద్దరు చొప్పున వైరల్​ఫీవర్ తో బాధపడ్తున్నారు. ఆ గ్రామంలో హెల్త్​ క్యాంపు పెట్టినట్టు మెడికల్ ఆఫీసర్ స్పందన తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ జ్వరాలు విజృంభిస్తున్నందున అన్ని చోట్లా హెల్త్​క్యాంపులు పెట్టాలని జనం ​కోరుతున్నారు. 

ట్రీట్మెంట్ కోసం అప్పు చేసినం 
వరదలకు మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. ఇంకా గోడల్లో చెమ్మ అట్లాగే ఉంది. మా ఇంట్లో నాతో పాటు నా కొడుకుకు కూడా జ్వరం వచ్చింది. తగ్గట్లేదు. ఇంకా దుర్వాసన వస్తున్న ఇంట్లో ఉండలేక మా అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నం. రూ.6 వేలు అప్పు చేసి వైద్యం చేయించుకున్నం. ఊర్లోకి ఏఎన్ఎంలు వచ్చి గోళీలు ఇస్తున్నా జ్వరం తగ్గట్లే. భద్రాచలం పోయి చూపించుకుంటున్నం.  ‑ రాగ దుర్గాప్రసాద్, రెడ్డిపాలెం, బూర్గంపాడు  

ఒక్క రోజే 417 ఫీవర్ కేసులు  
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 417 వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ గ్రామానికి వెళ్లి సర్వే చేస్తున్నాం. ఎంత శానిటేషన్ చేసినా వర్షం, వరదల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. విషజ్వరాలను అదుపులోకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. - గొంది వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం