- సొసైటీల పేరుతో అక్రమాలు
- గిరిజన యువత ఉపాధికి గండి
- ప్రశ్నించే వారిపై దాడులు
- చర్యలు తీసుకోని ఆఫీసర్లు
భద్రాచలం, వెలుగు:
గోదావరి నదిలో కాంట్రాక్టర్లు రూల్స్‌కు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానిక యువతపై దాడులకు పాల్పడుతున్నారు. ఇందుకు ఈ మధ్య జరిగిన సంఘటనే నిదర్శనం. చర్ల మండలంలో సి.కత్తిగూడెం, మొగళ్లపల్లి, వీరాపురం ఇసుక ర్యాంపుల్లో గిరిజనుల ఉపాధికి గండి కొడుతూ రైజింగ్కాంట్రాక్టర్యంత్రాలతో ఇసుక తవ్విస్తున్నారు. అంతేకాకుండా లారీల్లో లోడ్ చేసి డంప్చేస్తున్నారని యువకులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే విచారణ జరపాలంటూ రెవెన్యూ, మైనింగ్, టీఎస్ఎండీసీ, కలెక్టర్ సహా అన్ని శాఖలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీన్ని జీర్ణించుకోలేని సదరు కాంట్రాక్టర్ ప్రోత్సాహంతో గిరిజన సొసైటీ సభ్యులు శనివారం జీపీపల్లిలో కోర్టును ఆశ్రయించిన యువకుడు పెద్దిరాజును నిర్బంధించారు.
గిరిజన యువతకు ఉపాధే లక్ష్యంగా..
ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు చేపట్టే క్రమంలో స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పించే ఉద్ధేశంతో పలు నిబంధనలు రూపొందించారు. ట్రాక్టర్లలో ఇసుకను లోడ్‌చేయడం, ఒడ్డుపై డంప్చేయడం లాంటి పనులను గిరిజనులతో చేయించాలి. తద్వారా వారికి ఉపాధి లభిస్తోంది. ఈ బాధ్యతను గిరిజన సొసైటీలకు అప్పగించారు. దీనికి విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి లారీల్లో లోడ్చేయిస్తున్నారు. ఈ విషయంపై చర్ల మండలానికి చెందిన 3 యువకులు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో తమ అక్రమాలను ప్రశ్నిస్తారా అని ఆదివాసీల సొసైటీ పేరుతో బినామీ రైజింగ్ కాంట్రాక్టర్లు దాడులు, నిర్బంధాలకు ఎగబడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మౌనంగా ఉంటున్నారు. హైకోర్టును ఆశ్రయించిన పెద్దిరాజు అనే యువకుడిని నిర్బంధించడాన్ని బట్టి వారు ఎంతలా బరితెగిస్తున్నారో అర్థమవుతోంది. అమాయక ఆదివాసీలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తూ గోదావరి ఇసుక ర్యాంపుల్లో రైజింగ్ కాంట్రాక్టర్లు లబ్ధిపొందుతున్నారు.
దాడులు సాధారణమయ్యాయి..
ఇసుక ర్యాంపుల్లో దాడులు సర్వసాధారణంగా మారాయి. అక్రమార్కులు, మాఫియాకు ఆఫీసర్లు కొమ్ముకాస్తుండడంతో నానాటికీ పెరుగుతున్నాయి. గత నెల 12న బూర్గంపాడు మండలం సారపాకలో పూర్ణ అనే యువకుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మాఫియా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పది రోజుల కిందట చర్ల మండలంలోని సి.కత్తిగూడెం, మొగళ్లపల్లి, వీరాపురం ఇసుక ర్యాంపుల్లో అర్ధరాత్రి భారీ యంత్రాల సాయంతో ఇసుకను తవ్వుతున్నారన్న సమాచారంతో మీడియా సభ్యులు అక్కడకు వెళ్లారు. వారి రాకను గమనించిన కాంట్రాక్టర్లు స్థానిక ఇసుక సొసైటీ సభ్యులను ప్రేరేపించి వారిని నిర్బంధించారు. రాత్రివేళల్లో అక్రమాలు జరుగుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రైజింగ్ కాంట్రాక్టర్లలో అధికార పార్టీ లీడర్లు ఉండడంతో వారు ఇష్టారీతిగా గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.
ర్యాంపులేమైనా రహస్య కేంద్రాలా?
ఇసుక ర్యాంపులేమైనా రహస్య కేంద్రాలా..? నిషేధిత ప్రాంతాలా..? ఎందుకు వెళ్లకూడదు. వెళ్లినవారిపై దాడులు చేయడం దారుణం. దీనిపై విచారణ చేయించాలి. అక్రమాలు జరుగుతున్నాయని కోర్టు కెళ్లిన యువకుడి ఇంటిపై దాడి చేయడం సరికాదు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. రేజింగ్కాంట్రాక్టర్ల ఆగడాలను ఆపాలి.
- కొండా చరణ్, చర్ల
సమస్యలుంటే ఆఫీసర్ల దృష్టికి
సమస్యలుంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలి. అంతేగానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఫిర్యాదు చేస్తే మేం విచారిస్తాం. ఎవరికైనా సమస్య వస్తే ఫిర్యాదు చేయొచ్చు.
- అశోక్‌కుమార్, సీఐ, చర్ల