అకౌంట్ అప్ డేట్ పేరిట రూ. లక్ష కొట్టేశారు

అకౌంట్ అప్ డేట్ పేరిట రూ. లక్ష కొట్టేశారు

ఘట్ కేసర్, వెలుగు: బ్యాంక్ అకౌండ్ అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ తో  మహిళ రూ. లక్ష పోగొట్టుకుంది.  బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఘట్ కేసర్ మున్సిపల్ పరిధి బొక్కోనిగూడకు చెందిన గృహిణి అర్చన వాట్సాప్ కు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన మెసేజ్ ను చూసింది. అందులో మీ బ్యాంక్ అకౌంట్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని, లేదంటే బ్లాక్ అవుతుందని ఉంది.  మెసేజ్ లింక్ ద్వారా అప్ డేట్ చేసుకోవాలని ఉండగా అర్చన ఆ లింక్ పై నొక్కింది. పాన్, ఆధార్ నంబర్ తో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్ తో పాటు వెంటనే వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేసింది. దీంతో బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అయిందనే మెసేజ్ వచ్చింది. అదే రోజు సాయంత్రం అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోగా రూ. లక్ష నగదు పోయింది.  ఆందోళనకు గురైన అర్చన భర్తతో కలిసి వెళ్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేశామని అడ్మిన్ ఎస్ ఐ రాము నాయక్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.