క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

మోసాలకు కాదేది అనర్హం అన్నట్టు సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త ఎత్తులతో  ఎప్పటికప్పుడు అమాయకులను మోసం చేస్తున్నారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో  ఓ అమాయకుడి నుంచి కేటుగాళ్లు రూ. 96 లక్షలు కాజేశారు. క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని చీటర్స్ నమ్మించారు. వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయం చేసుకుని.. మొదట లాభాలను సైబర్ కేటుగాళ్లు చూపించారు. అది చూసి నమ్మిన బాధితుడు తాము పంపించిన యాప్ ద్వారా ట్రేడింగ్ చేయాలని, అలా చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఇది నమ్మిన బాధితుడు.. లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు తీసుకోవాలంటే  కమిషన్, ఛార్జీలు అవుతాయంటూ 96 లక్షలు తీసుకున్నారు. దీంతో  మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవల క్రిప్టో  కరెన్సీని తక్కువ రేటుకు ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి డబ్బులు కొట్టేసిన ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ కు చెందిన ​ఐదుగురు గ్యాంగ్ గా ఏర్పడి ఆన్ లైన్ ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారిని మోసం చేశారు.

కొంపల్లికి ఓ వ్యక్తిని ఇలాగే ట్రాప్ చేసిన ఈ గ్యాంగ్ థర్డ్ పార్టీ యాప్స్​ ప్రమేయం లేకుండా ఆన్ లైన్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్ కంటే తక్కువకే క్రిప్టో కరెన్సీని ఇప్పిస్తామని నమ్మించారు. అతడి దగ్గరి నుంచి రూ.19 లక్షలు వసూలు చేశారు. క్రిఫ్టో కరెన్సీ తన వాలెట్​లోకి యాడ్ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పేట్ బషీరాబాద్ పీఎస్ ​లో కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ ​కి తరలించారు.