ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ పేరుతో రాష్ట్ర సర్కార్ దోపిడీ

 ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ పేరుతో రాష్ట్ర సర్కార్ దోపిడీ
  • జీవో 59 కింద అప్లికేషన్ పెట్టుకున్నోళ్లకు నోటీసులు
  • ప్లాట్ విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్షల్లో ఫీజు కట్టాలని ఆదేశం 
  • ప్రభుత్వ ఖజానాకు రూ.4 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా 
  • ఇప్పటికే అప్లికేషన్ల ద్వారా రూ.7 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ పేరుతో రాష్ట్ర సర్కార్ దోపిడీకి తెరలేపింది. జీవో నంబర్ 59 కింద అప్లికేషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో ఫీజు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు జారీ చేస్తోంది. గత వారం, పది రోజులుగా కలెక్టర్ల నుంచి నోటీసులు అందుకుంటున్న దరఖాస్తుదారులు.. అందులో పేర్కొన్న అమౌంట్ చూసి లబోదిబోమంటున్నారు. మూడు నెలల్లో లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో పేదలు ఇండ్లు కట్టుకున్న స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌కు సర్కార్ నిరుడు ఫిబ్రవరిలో మరో అవకాశం ఇచ్చింది. జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా రెగ్యులరైజ్ చేయనున్నారు. 125 గజాల నుంచి వెయ్యిలోపు ఉంటే జీవో 59  కింద రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్లు స్వీకరించగా 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 90 వేల దరఖాస్తులు జీవో 58 కింద వచ్చాయి. మరో 70 వేల దరఖాస్తులు జీవో 59 కింద రాగా, ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున అప్లికేషన్ ఫీజుగా రూ.7 కోట్ల ఆదాయం సమకూరింది. 

3 నెలల్లో కట్టాలని ఆదేశం.. 

పేదల నుంచి అందిన అప్లికేషన్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరుడు మే నుంచి సెప్టెంబర్ మధ్య ఫీల్డ్ సర్వేలు చేయించారు. ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇంటి పన్నులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితరాలు పరిశీలించి అర్హులను గుర్తించారు. సర్వే బృందాలు ఇచ్చిన నివేదిక ప్రకారం దరఖాస్తులను కలెక్టర్ల స్థాయిలో మరోసారి పరిశీలించారు. అనంతరం అర్హుల జాబితాను ఆమోదించి ప్రభుత్వానికి పంపించారు. ఇందులో సర్వే నంబర్, ఏరియా ఆధారంగా సంబంధిత స్థలానికి సంబంధించిన మార్కెట్ వాల్యూను వేసి పంపారు. ఆ జాబితాలకు ఇటీవల ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో దరఖాస్తుదారులకు రెవెన్యూ సిబ్బంది డిమాండ్ నోటీసులు పంపుతున్నారు. అలాగే సెల్ ఫోన్లకు మెసేజ్ లు కూడా పంపుతున్నారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నోళ్లకు ప్లాట్ మార్కెట్ వాల్యూను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల మేర ఫీజు విధిస్తున్నారు. మొత్తం ఫీజును మూడు విడతలుగా మూడు నెలల్లో చెల్లించాలని పేర్కొంటున్నారు. దరఖాస్తుదారులు ఈ నోటీసులను చూసి ఆందోళనకు గురవుతున్నారు. అందినచోటల్లా అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఫీజులు చెల్లించేవారు సుమారు 70 వేల మంది ఉంటారని, ప్రస్తుతం విధిస్తున్న రెగ్యులరైజేషన్ చార్జీలను బట్టి చూస్తే రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్ల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఫీజు చెల్లించేందుకే మొగ్గు..  

125 గజాల్లోపు ఉన్న వాళ్లకు జీవో నంబర్ 58 కింద ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కొందరు ఫీజు చెల్లించేందుకే పేదలు మొగ్గు చూపుతున్నారు. ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకుంటే సర్కార్ నుంచి భూమి కొనుగోలు చేసుకున్నట్లుగా ఉంటుందని, ఎప్పటికైనా సొంత ప్లాట్ అనే ధీమాతో ఉండొచ్చని, అవసరానికి అమ్ముకోవచ్చని భావిస్తున్నారు. దీంతో 125 గజాల లోపు ఉన్నవాళ్లు కూడా జీవో నంబర్ 59 కింద తమ అప్లికేషన్లను మార్చుకున్నారు. ఆదాయం వస్తుండడంతో సర్కార్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ దరఖాస్తుదారులు ఇదే పద్ధతిని అనుసరించారు.  

ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం అప్లికేషన్లు పెండింగ్.. 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఖరీదైన భూములున్న చోట, ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో మాత్రం పేదల దరఖాస్తులను పక్కన పెట్టినట్లు తెలిసింది. వీటికి అప్రూవల్ ఇస్తారా? రిజెక్ట్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే ఒకే సర్వే నంబర్ లో, ఒకే నివాస సముదాయంలో కొన్ని ఇండ్ల స్థలాలకు డిమాండ్ నోటీసులు ఇచ్చి.. మరికొన్నింటికి ఇవ్వకపోవడంపై దరఖాస్తుదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వక్ఫ్, ఎండోమెంట్, ఎఫ్ టీఎల్ ఏరియాలు, ఇనాం, అసైన్డ్, అటవీశాఖ తదితర ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నోళ్లు అప్లై చేసుకుంటే అలాంటి అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు.

25 శాతమైతే 50% కట్టుమన్నరు.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ లోని 274 సర్వే నంబర్ లో ఓ కుటుంబం 100 గజాల సర్కార్ స్థలంలో ఇళ్లు కట్టుకుంది. జీవో 58 కింద ఫ్రీగా రెగ్యులరైజేషన్ అయ్యే చాన్స్ ఉన్నప్పటికీ.. అది ఎప్పటికీ అసైన్డ్ ల్యాండ్ గానే ఉండిపోతుందనే ఉద్దేశంతో ఫీజు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. జీవో 59 కింద రెగ్యులరైజ్ చేయాలని అధికారులను కోరితే రూ.1,99,500 ఫీజు వేశారు. నామమాత్రంగా రూ.50 వేల లోపు వస్తుందనుకుంటే రూ.2 లక్షలు రావడంతో కంగుతిన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో సర్కార్ లెక్క ప్రకారం ల్యాండ్ వాల్యూ గజం రూ.4,200 ఉంది. జీవో ప్రకారం 250 గజాల్లోపు స్థలానికి మార్కెట్ వాల్యూలో 25 శాతం మాత్రమే (సుమారు లక్ష) చెల్లించాలి. కానీ 50 శాతం ఫీజు వేశారు. 


30 లక్షలు కట్టాలంటూ నోటీస్.. 

రంగారెడ్డి జిల్లాలోని చందానగర్ కు చెందిన ఓ వ్యక్తి తన 160 గజాల స్థలం రెగ్యులరైజేషన్ కోసం జీవో నంబర్​ 59 కింద దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఆధారంగా రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశారు. అంత డబ్బులే ఉంటే తాను బయట ఎక్కడైనా ప్లాట్ కొనుక్కునేవాడినని, షాపులో పని చేసుకునే తాను ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.