తెలంగాణ ఉద్యమంలో.. కృషి ఎవరిది కుర్చీ ఎవరికి

తెలంగాణ ఉద్యమంలో.. కృషి ఎవరిది కుర్చీ ఎవరికి

‘మరో ఇరవై ఏండ్లు మాదే అధికారం’ అన్నాడొక నాయకుడు ఈ మధ్య. ఆ మాటతో గుండెల్లో కలుక్కుమంది. బల్లెంపోటు దిగినంత బాధ. ఇంకా ఇరవై ఏండ్లు వీళ్లే ఉంటరా? ఎన్నో తరాలు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ వీళ్ల కోసమేనా? బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు తమను తాము పరిపాలించుకోవడానికి కాదా? దుఃఖం, ఆవేదన ఎగదన్నుకొచ్చింది. ‘ఆరిపోయేముందు అట్లనే అంటరులే! ఈసారి గెలిపిస్తే గదా మళ్ల వచ్చేది. వాళ్లకు ఓటేయకపోతే చాలు’ అని అన్నాడొక మిత్రుడు. ఆ మాట నిజమే గానీ, ప్రజలు తెచ్చుకున్న తెలంగాణ.. ప్రజలు పాలించుకోవడానికి కదా! మొన్న గులాబీ జెండాలో మాకూ హక్కున్నది అన్నందుకు కుడి భుజం అన్నవారే మూలాల మీద దెబ్బ మీద దెబ్బ వేస్తున్నారు. ఇప్పుడు జెండానే కాదు ఏకంగా రాష్ట్రమే మాదంటున్నారు. ఈ ప్రజలంతా ఏమైపోవాలి? ఎన్నెన్ని కష్టాలు దాటి తెలంగాణ తెచ్చుకున్నాం. గుర్తుకు వస్తేనే ఆవేశంతో రక్తం మరిగిపోతోంది.

ఇప్పుడు కొత్తతరం కొత్తపాట అందుకున్నది. తెలంగాణ ఉద్యమాల్లో కృషి ఎవరిది? కుర్చీ ఎవరికి దక్కింది? ఓటు మనది.. సీటు మనది.. కుర్చీ మనది.. పదవి మనది.. పరిపాలన మనది.. దొర ఏందిరో దొర పోకడేందిరో? శ్రమ ఎవడిదిరా? సిరి ఎవడిదిరా? అంటూ పాడడం మొదలైంది. సాగదు సాగదు ఇక దొరల పాలన సాగదు అంటున్నారు. ఇదే నినాదం ఉద్యమ కాలంలో ఎందుకివ్వలేదు? ఎందుకివ్వలేదంటే అధికారం రుచిమరిగిన రాజకీయాలు ఒకవైపు.. త్యాగాల బాటలో సాగే ఉద్యమాలు మరోవైపు. ఉద్యమకారులు పంట వేస్తారు.. రాజకీయ నాయకులు కోసుకుంటారు. కుర్చీలు ఎక్కుతుంటారు. తప్పు ఎవరిది? ఉద్యమకారులదే. ఈ విషయం కొత్తతరానికి అర్థమవుతున్నది. అందుకే రాజకీయాల్లో అలజడి మొదలైంది. ఒకవైపు కొత్త బీఎస్పీ, మరోవైపు కొత్త కాంగ్రెస్, ఇంకోవైపు కొత్త వైఎస్ఆర్​టీపీ ఇలాంటి కదలికలను ఈ కోణంలో చూడాలి. ఇక ఉద్యమకారులే రాజకీయ ఉద్యమాలు చేస్తారు. ఉద్యమకారులే రాజకీయాలు నడిపి ఉంటే 1969-–70లోనే తెలంగాణ ఏర్పడి ఉండేదని మరిచిపోకూడదు. రాజకీయ స్వార్థాలు ప్రజలను ఎలా ముంచుతాయో ఆ చరిత్ర కొంత తెలుసుకోవడం అవసరం.
పదవులు పట్టుకుని వేళ్లాడిన నాయకులు
మలిదశ తెలంగాణ ఉద్యమం సాగిసాగి రాజకీయ నాయకుల చేతుల్లోపడి నలిగినలిగి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. రాజకీయ నాయకుల చేతుల్లో పడకుండా ఉంటే 2003-–04 లోనే తెలంగాణ ఏర్పడి ఉండేదని కొందరి అభిప్రాయం. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని వారిని ఎన్నుకున్న ప్రజలు డిమాండ్​ చేసినా పదవి పట్టుకుని వేళ్లాడారు తప్పితే ప్రజల పక్షాన నిలబడలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ తెలంగాణను అడ్డుకుంది. టీడీపీతో పొత్తుగల అప్పటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు బాటవేయలేదు. నిజానికి 1998 కాకినాడ సభలో బీజేపీ జాతీయ కమిటీ ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేసింది. ఆ ప్రకారంగా ఆలె నరేంద్ర పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బిల్లు ముందుకు పోలేదు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మాట తప్పింది. టీఆర్ఎస్ వారిని బుట్టలో వేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేర్చుకుని అధికారం రుచి చూపింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయకపోవడం వల్ల మరోసారి రాష్ట్ర ఏర్పాటు వమ్మయింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు ఎన్ని త్యాగాలకు, సమ్మెలకు సిద్ధపడినా ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు వదలక, కనీసం రాజీనామా చేస్తామని బెదిరించలేకపోయారు. 
అలుపు లేకుండా ఉద్యమించిన ఉద్యమకారులు
యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్​కు ఉన్న142 మంది ఎంపీల్లో మెజార్టీ షేర్ ఏపీదే కావడం వారికి వరమై తెలంగాణకు శాపమైంది. రోజురోజుకూ బలపడిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1998లో తెలంగాణకు అనుకూలంగా మద్దతు కూడగట్టినవాడే అధికారం, సంపద అందినాక తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తారన్న మాటలు వమ్ము కావడంతో రాజకీయాల్లో కృతజ్ఞతకు స్థానం లేదా? అని మేధావులు అక్రోశించారు. నిలదీసారు. చివరకు 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ప్రకటించారు. దాన్ని ఆంధ్రా లాబీ వీరప్ప మొయిలీ ద్వారా అడ్డుకుంది. చిదంబరాన్ని దుమ్మెత్తి పోశారు. అప్పుడు ఏడు వేల కోట్ల దాకా చేతులు మారాయన్న పుకార్లు భగ్గుమన్నాయి. ఆంధ్రాలో వ్యతిరేక ఉద్యమమంటూ పుట్టించి ప్రచారం చేశారు. చివరికి పార్లమెంట్​లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించారు. ఇలా 1995 నుంచి ఉద్యమకారులు అలుపు లేకుండా, రిలే పరుగు పందెంలా ఒకరు కాకపోతే మరొకరు ఉద్యమిస్తూ వచ్చారు. దీంతో విద్యార్థులు, యువకులు ఎంతో నష్టపోయారు. ఎన్నో త్యాగాలు చేశారు. కేసుల పాలయ్యారు. రాష్ట్రం వస్తే మూడు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలు వమ్మయ్యాయి. ఏ లక్ష్యంతో ముందుకు కదిలారో అది నెరవేరలేదు. పైగా ఉద్యమకారులపై కేసులు అలాగే కొనసాగాయి. ఇది ఉద్యమకారుల చరిత్ర.
రాజకీయాలకు బలవుతూ వచ్చిన తెలంగాణ
అధికారంలో ఉండేవారి చరిత్ర వేరు. ఉద్యమ చరిత్ర వేరు. ఉద్యమాల్లో రాజకీయాలు ప్రవేశించి తమ ప్రాభవానికి అనువుగా ఉద్యమాలను మలుపు తిప్పడం వేరు. 1969 జై తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి రాజకీయాల ప్రవేశంతో తెలంగాణ ఉద్యమం మలుపులు వేరు. 1970 నాటికే రాష్ట్రం ఏర్పడాల్సినా.. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల వల్ల మోసపోయింది. ఫజల్ అలీ కమిషన్ చెప్పినప్పటికీ ప్రత్యేక రాష్ట్రాలుగా విదర్భ(నాగపూర్), తెలంగాణ (నైజాం హైదరాబాద్) ఏర్పడకుండా ఆనాటి కేంద్ర హోంమంత్రి చవాన్  అడ్డుకున్నారు. తెలంగాణ ఇస్తే విదర్భ ఉద్యమం వస్తుందని మరికొన్ని కారణాల చేత రాష్ట్ర ఏర్పాటు పక్కకుపోయింది. ఇందిరాగాంధీ ఆ కీర్తి దక్కించుకోలేకపోయింది. రాజకీయ ఎత్తుగడలకు తెలంగాణ బలైపోయింది. అప్పటి నుంచి రాజకీయాలకు తెలంగాణ బలవుతూ వచ్చింది. ఇంద్రారెడ్డి ఒకసారి, మరొకరు మరోసారి, 1997 భోనగిరి డిక్లరేషన్ తో ఉద్యమకారులంతా నక్సలైట్లని పేరు పెట్టి ఆనాటి సీఎం చంద్రబాబు చేయని అకృత్యం లేదు. అణచివేతలు, నిర్బంధాలు ఎదురైనా ప్రజలు ఉద్యమిస్తూనే వచ్చారు. గద్దర్ ను చంపాలని చూశారు. బెల్లి లలితను చంపేశారు. 


బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం ఇంకెప్పుడు
చివరకు ఇన్ని త్యాగాలు, బలిదానాలు.. ఒక కుటుంబం, ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి పాలయ్యాయి. ఆయన సామాజికవర్గం అన్ని రంగాలనూ ఆక్రమించుకుంటోంది. ఇప్పుడు మరో ఇరవై ఏండ్ల దాకా మేమే అధికారంలో ఉంటాం అంటున్నారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేపట్టేదెన్నడు? ఇలాగే ఓట్లు వేసి ఎరవేసిన వారినే ఇంకా గెలిపించాలంటున్నారా? గెలిపిస్తారో, ఓడిస్తారో, తామెదుగుతూ వస్తారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఉపాధి కోసం మొదలైన ఉద్యమం రాజకీయ నాయకులకు అధికారాన్నిచ్చింది. కానీ అనుకున్న ఉద్యోగాలు రాలేదు. చివరికి విద్యావంతులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధికారం అందుకున్న వారు మాత్రం సంపన్నులవుతున్నారు. చరిత్ర నిర్మాతలుగా  వినుతికెక్కారు. ఉద్యమాలు చేసినా ఏమీ రాకపాయె అని ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఇలా అధికారంలో ఉండేవారి చరిత్ర వేరు. ఉద్యమకారుల చరిత్ర వేరు. రాజకీయాల కోసం చేసే ఉద్యమాల చరిత్ర వేరు.

వీరంతా ద్రోహులతో అధికారం పంచుకున్న వారే
వేలాది మంది కలిసి చేసిన మలి దశ తెలంగాణ ఉద్యమ నిర్మాణ సమయాన కేసీఆర్​ ఎక్కడున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి, విజయరామారావు, ఇంకా ఆనాడు టీడీపీలో.. నేడు టీఆర్ఎస్ లో ఉండి రాజ్యమేలుతున్నవారు ఎక్కడున్నారు? ఆనాడు కేసీఆర్​ సహా వీరంతా చంద్రబాబుతో, ఉద్యమ ద్రోహులతో కలిసి అధికారం పంచుకున్న వారే కదా. నిర్బంధాలు ప్రయోగించినపుడు వారితోనే కదా ఉన్నది? అందువల్ల రాజకీయ నాయకులు అలాంటి చరిత్రను కనపడకుండా, వినపడకుండా చేస్తారు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో తరాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ.. ఉద్యమకారుల చేతుల్లో లేకుండా పోయింది. ఉద్యమకారులకు స్థానం లేకుండాపోయింది. రాజకీయాల కోసం, అధికారం కోసం ఉద్యమంలోకి వచ్చిన వారి చేతుల్లోపడి తెలంగాణ మరోసారి మోసపోయింది. పేరు మార్చుకున్న టీడీపీయే అధికారం చేజిక్కించుకున్నట్టయింది. ప్రతిసారి మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల వల్లనే తెలంగాణ మోసపోయింది.

                                                                                                                                                                                                       - బీఎస్ రాములు, సామాజిక తత్వవేత్త