స్టూడెంట్ల ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేడు

స్టూడెంట్ల ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేడు

ఆసిఫాబాద్, వెలుగు :సర్కారు నిర్లక్ష్యం,అధికారుల పట్టింపులేనితనంతో విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏల పరిధిలో నిర్వహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో జ్వరం వస్తే కనీసం గోలీలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆశ్రమ స్కూల్స్ లో పని చేస్తున్న ఏఎన్ఎంలను సర్కార్ ఇప్పటి వరకు రెన్యూవల్ చేయకపోవడంతో స్టూడెంట్ల ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.  ఫలితంగా పలుచోట్ల జ్వరాలతో స్టూడెంట్స్​ చనిపోతున్నారు.

రోగమొస్తే ఇంటికే...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 133 ట్రైబల్ వెల్ఫేర్​ హాస్టల్స్​ఉండగా 40,427 మంది స్టూడెంట్లు ఉన్నారు. ప్రతి హాస్టల్​కు ఒక్కరి చొప్పున 133 మంది ఏఎన్ఎంలు ఉండేవారు. ఎవరైనా స్టూడెంట్​కు జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగా లేకపోయినా దగ్గరుండి చూసుకునేవారు.  చిన్న రోగమైతే మందులు ఇవ్వడం, హాస్పిటల్​కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వెంట ఉండి తీసుకువెళ్లి చూపించి తీసుకువచ్చేవారు. ఈ ఏడాది జూన్​తో వీరి గడువు ముగిసిందనే నెపంతో సర్కారు  రెన్యూవల్ ​చేయకపోవడంతో ఆ పని..టీచర్లు, సిబ్బందిపై పడింది. వీరికి సరైన అవగాహన లేకపోవడంతో పిల్లలకు సీరియస్​అయ్యేంతవరకు గుర్తించలేకపోతున్నారు. చివరి నిమిషంలో హాస్పిటల్​లో జాయిన్ ​చేయించినా ప్రయోజనం లేకుండా పోతోంది. మరికొంతమందికి రెండు, మూడు రోజులు ట్రీట్​మెంట్​ చేయించి తర్వాత తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఇండ్లకు పంపించేస్తున్నారు. దీంతో గిరిజన పల్లెలకు వెళ్తున్న విద్యార్థులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాగే గత నెల బెజ్జూరు మండలం మోగవెల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి రాజేశ్​ చనిపోయాడు. ప్రస్తుతం తిర్యాణి మండల కేంద్రంలోని హాస్టల్​లో ఇద్దరు, రొంపల్లి ఆశ్రమ హాస్టల్​లో ముగ్గురు, చెలిమెల హాస్టల్​లో ఆరుగురు, గిన్నెదరి​లో నలుగురు,  మంగి హాస్టల్​లో ఐదుగురు, సిర్పూర్​ టి మండలం పెంచికల్​పేటలోని ఎల్లూరు హాస్టల్​లో ఇద్దరు, జైనూర్​ మండలం మార్లవాయిలో నలుగురు, పోచంలొద్దిలో ఐదుగురు జ్వరాలతో బాధపడుతున్నారు. రెగ్యులర్​ఏఎన్ఎంలు ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, సబ్​సెంటర్లలో పని చేసే ఏఎన్​ఎంలు వచ్చి చూడాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. 

ఏఎన్ఎంలను రెన్యూవల్​ చేయరా? 
2005 నుంచి ఐటీడీఏ హాస్టళ్లలో ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 5 వేల జీతం ఇచ్చేవారు. ఈ డబ్బులను ఐటీడీఏనే చెల్లించేది. 2018 నుంచి ఐటీడీఏ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఏఎన్ఎంల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఏజెన్సీ గడువు ఈ ఏడాది జూన్​తో ముగిసింది. దీంతో ఐటీడీఏ గాని, ప్రభుత్వం గాని రెన్యూవల్ చేయడానికి ఆసక్తి చూపలేదు. స్టూడెంట్లకు వైద్యం అందిచేవారు కరువయ్యారు.  

వెట్టి చాకిరి చేయించి తీసేసిండ్రు
2005 నుంచి పార్ట్ టైం ఏఎన్ఎంలుగా ట్రైబల్ హాస్టళ్లలో డ్యూటీ చేస్తూ వచ్చినం. రోజు నాలుగ్గంటలే డ్యూటీ చేయాల్సి ఉన్నా 
24 గంటలు హాస్టల్స్ లోనే ఉంటూ సేవలందించాం. హాస్టళ్లలో జ్వరాలతో చనిపోయే వారి సంఖ్యను తగ్గించగలిగాం. మేము డ్యూటీలో ఉన్నప్పుడు స్టూడెంట్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నం. ఏజెన్సీ గడువు అయిపోయిందని పక్కన పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ఏఎన్ఎంలు ఉపాధి కోల్పోయారు. ఇన్నాళ్లు వెట్టిచాకిరీ చేయించుకుని ఇప్పుడు వదిలేశారు. ట్రైబల్ స్టూడెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డ్యూటీలు ఇప్పిస్తే సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నం.
- మెస్రం ప్రమీల, ట్రైబల్ వెల్ఫేర్ ​హాస్టల్స్​ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు

ఆలస్యమే ప్రాణాలు తీసింది
బెజ్జూరు మండలం మోగవెల్లికి చెందిన ఆలం రాజేశ్​ పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ గిరిజన స్కూల్​లో పదో తరగతి చదివేవాడు. గత నెల రాజేశ్​కు వైరల్​ ఫీవర్​వచ్చింది. వెంటనే హాస్పిటల్​కు తీసుకువెళ్లాల్సిన సిబ్బంది అలా చేయకుండా ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బెజ్జూర్​ హాస్పిటల్​కు, అక్కడి నుంచి కాగజ్ నగర్ ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకువెళ్లేలోగా పరిస్థితి విషమించింది. జ్వరంతో పాటు రక్తహీనత ఉండడంతో ఏమీ చేయలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. చివరికి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. 
ముందే హాస్పిటల్​కు తీసుకుని వెళ్లి ఉంటే బతికేవాడని తల్లిదండ్రులంటున్నారు. 

ఏఎన్ఎంల భర్తీకి చర్యలు తీసుకుంటున్నం
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్​లో ఏఎన్ఎంలుగా డ్యూటీ చేసిన హెల్త్ వర్కర్ల సమస్య మా దృష్టికి వచ్చింది. గతంలో ఆ పోస్టులు మంజూరు లేకపోయినా కొనసాగించాం. బడ్జెట్ రాకపోవడంతో రెన్యూవల్ ​చేయలేదు. ప్రస్తుతం హాస్టల్స్​లో పరిస్థితి దృష్ట్యా సర్కారుకు ప్రతిపాదనలు పంపాం. అప్రూవల్​రాగానే పోస్టులు భర్తీ చేస్తాం.  - వరుణ్ రెడ్డి, ఐటీడేఈ పీఓ ,ఉట్నూర్