పట్టింపులేని అధికారులు.. కంట్రోల్ తప్పిన సిబ్బంది

పట్టింపులేని అధికారులు.. కంట్రోల్ తప్పిన సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీలో కొందరు అధికారులు, సిబ్బంది ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఉద్యోగులపై ఉన్నతాధికారుల కంట్రోల్ తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీఎస్​పీఎస్సీలో ఏకంగా 26 మంది గ్రూప్1 పరీక్షలు రాసినా.. కనీసం వారి గురించి ఆరా తీయకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి అద్దం పడుతున్నది. కొందరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియని పరిస్థితి ఉందని కమిషన్‌‌లోని సిబ్బందే చెప్తున్నారు.  ఈ నిర్లక్ష్యం వల్ల ఏకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్​తో సహా నాలుగు పేపర్లను రద్దు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

నిర్లక్ష్యమే కొంపముంచింది

కమిషన్‌‌లో కొందరు ఉద్యోగులు డ్యూటీ పేరుతో అర్ధరాత్రి దాకా ఆఫీసుల్లో ఉంటున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీకి ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. ఒక ఉన్నతాధికారి వద్ద పీఏగా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరకు రెగ్యులర్‌‌‌‌గా ఒక లేడీ వస్తున్నా.. కనీసం అనుమానించలేదు. విజిటర్స్ రిజిస్టర్‌‌‌‌లోనూ ఆమె పేరు రాయలేదని సమాచారం. ఈ అంశంపై స్పందించిన ఓ ఉన్నతాధికారి.. ‘ఫలానా వ్యక్తి కమిషన్ ఆఫీస్‌‌కు రెండు సార్లు వచ్చారని, మూడు సార్లు వచ్చారని బెల్ ఏమీ మోగదు కదా’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే కమిషన్ ఆఫీసులో ఎవ్వరిపైనా కంట్రోల్ లేదని స్పష్టమవుతున్నది. బయటి వ్యక్తులు లోపలికి రావాలంటే సవాలక్ష క్వశ్చన్లు అడిగే అధికారులు.. కొందరి విషయంలో ఎందుకు అలా వ్యవహరించారనే దానికి ఆన్సర్ లేదు. 2022లో ఏకంగా 26 నోటిఫికేషన్లు ఇచ్చారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితారాంచంద్రన్ ఆ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, క్వశ్చన్ పేపర్ల తయారీపైనే దృష్టి పెట్టారు. కానీ ఆఫీసులో జరిగే గూడుపుఠాణీని మాత్రం గుర్తించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సిబ్బంది తక్కువగా ఉండటమూ ఓ కారణంగా చెప్తున్నారు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు స్పందించి.. టీఎస్‌‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

ఒక్కో పేరు వెలుగులోకి

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముందుగా కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్,  డేటా ఆపరేటర్ రమేశ్‌‌, ఐటీ విభాగంలో పనిచేసి మానేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేశ్‌‌ పేర్లూ నిందితుల జాబితాలో చేర్చారు. ఈ లెక్కన మొత్తం 12 మంది అరెస్ట్ అయితే, వారిలో ఐదుగురు టీఎస్​పీఎస్సీతో సంబంధం ఉన్న వారే కావడం గమనార్హం. మరికొంత మంది టీఎస్​పీఎస్సీ ఉద్యోగులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్లను ఇవ్వాలో, రేపో అధికారికంగా అరెస్ట్ చేసే చాన్స్​ ఉంది. కమిషన్‌‌లో ఓ టీమ్ అంతా కలిసి గూడుపు ఠాణీ నడుపుతున్నట్టు తెలుస్తున్నది.  కమిషన్‌‌కు చెందిన వాళ్లలో 26 మంది పరీక్షలు రాయగా.. అందులో ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారని, మిగిలిన వారు కాలేదని చెప్తున్నారు.