టర్కీలో కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల బామ్మ

టర్కీలో కరోనా నుంచి కోలుకున్న 93 ఏళ్ల బామ్మ

ఇస్తాన్ బుల్: టర్కీలో కరోనా నుంచి 93 ఏళ్ల బామ్మ కోలుకుంది. ఇస్తాన్ బుల్ లోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. డాక్టర్లు సంతోషంతో ఆమెకు వీడ్కోలు పలికారు. ‘ముసలివాళ్లకు కరోనా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారు కోలుకోవడం చాలా కష్టం. అయితే 93 ఏళ్ల బామ్మ కోలుకుంది. కరోనాపై పోరాడుతున్న మాకు, ఇతర పేషెంట్లకు స్పూర్తిగా నిలిచింది’ అని కెరఫాసా మెడికల్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ చెప్పారు. 93 ఏళ్ల అలయ్ గుండుజ్ తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పితో మార్చి 31న హాస్పిటల్ లో చేరింది. 10 రోజుల ట్రీట్ మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. తనలాగే అందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు అలయ్ గుండుజ్ అన్నారు. ప్రపంచంలోనే వేగంగా కరోనా వ్యాపిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. 47 వేల మందికిపైగా వైరస్ సోకగా, వెయ్యి మందికిపైగా మరణించారు. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు 24 గంటలూ పని చేస్తున్నారని, ఇప్పటికే ఒక డాక్టర్ కరోనాతో చనిపోగా, 600 మంది హెల్త్ వర్కర్లకు వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని కొందరు హెల్త్ వర్కర్లు ఇళ్లకు వెళ్లట్లేదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తమకు వైరస్ సోకదనే గ్యారంటీ లేదని ఏమీ డాక్టర్లు అంటున్నారు. పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారని, వారికి ధైర్యం చెబుతూ ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెప్పారు.