ఉదయ్ పూర్ ఘటన బాధితులకు రాజస్థాన్ సీఎం పరామర్శ

ఉదయ్ పూర్ ఘటన బాధితులకు రాజస్థాన్ సీఎం పరామర్శ

రాజస్థాన్ : ఉదయపూర్ లో ఇద్దరు వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్  కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం (జూన్ 30న) పరామర్శించారు. స్వయంగా కన్హయ్య లాల్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కన్హయ్య కుటుంబ సభ్యులకు రూ.51 లక్షల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ కేసును NIA విచారిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు సహకరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కేసు గురించి తాను హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ కేసు విచారణను ఒక నెలలోపు పూర్తి చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)ను కోరుతానని చెప్పారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రాన్నే కాకుండా యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. రాజస్థాన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి నెలకొనేలా మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరారు. 

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మంగళవారం (జూన్ 28న) ఇద్దరు వ్యక్తులు టైలర్ కన్హయ్య లాల్ ను(46 ఏళ్ల) చంపేసిన సంగతి తెలిసిందే. ఉదయపూర్ లో అత్యంత రద్దీగా ఉండే ధన్ మండి మార్కెట్‌లో తన దుకాణంలో కన్హయ్య లాల్ ఉండగా, కస్టమర్లుగా వచ్చిన నిందితులు మహమ్మద్‌‌ రియాజ్‌‌ అన్సారీ, మహమ్మద్‌‌ ఘోష్‌‌.. కన్హయ్యను హత్య చేసి పారిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో NIA దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

NIAకు కేసు దర్యాప్తు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాజస్థాన్​లోని ఉదయ్​పూర్ టైలర్ హత్య కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)​కి అప్పగించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఐఎస్​ తరహాలో మర్డర్ జరిగిన ఈ కేసులో టెర్రరిస్టుల కుట్ర ఉందా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేయగా.. కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్​ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో స్లీపర్ సెల్స్​ అనే అనుమానంతో పోలీసులు మంగళవారం (జూన్ 28న)  రాత్రి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎన్​ఐఏ అధికారులు బుధవారం (జూన్ 29న) మరో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

నిందితులకు పాక్​తో సంబంధాలు
టైలర్​ని చంపినవాళ్లలో ఒకరైన మహ్మద్ రియాజ్​అన్సారీకి పాక్​ టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. అతడి ఫోన్‌‌లో పాకిస్తాన్​కు చెందిన 10 నంబర్లు ఉన్నాయని చెప్పారు. దావత్ ఎ ఇస్లామ్ అనే గ్రూప్​తో అన్సారీ టచ్​లో ఉన్నాడని తెలిసిందన్నారు. మరో నిందితుడు రెండు సార్లు నేపాల్ వెళ్లి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్​లతో కలిశాడని చెప్పారు. అతనికి దుబాయ్​లోనూ సంబంధాలున్నట్లు గుర్తించామని చెప్పారు. కన్హయ్యను చంపడానికి ముందు ఇద్దరూ కలిసి అనేక ఐఎస్​ వీడియోలు చూసినట్లు, పాకిస్తాన్​లోని ఫోన్ నంబర్లకు కాల్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.

సెక్యూరిటీ కోసం కన్హయ్య విజ్ఞప్తి
కన్హయ్య లాల్​కు వారం రోజుల కిందే చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని తెలిసింది. నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కన్హయ్య​ను జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. 15న ఆయన బెయిల్​మీద బయటకు వచ్చాడు. ఆ రోజు నుంచి నజీమ్ అనే వ్యక్తి మరికొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ధన్​మండి పోలీసులకు కన్హయ్య ఫిర్యాదు చేశాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువర్గాలను ఎస్​హెచ్​వో పిలిపించి నచ్చజెప్పి పంపించేశారే తప్ప టైలర్​కు రక్షణ కల్పించలేదని మండిపడ్డారు. అదే సమయంలో కన్హయ్య లాల్​కు సెక్యూరిటీ కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిందితులకు మరణశిక్ష విధించాలి
తమ కుటుంబానికి భద్రత కల్పిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారని మృతుడు కన్హయ్య లాల్ కుమారుడు యశ్ చెప్పాడు. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. తమ కుటుంబానికి  సీఎం ఆర్థిక సహాయం కూడా చేశారని, తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పాడు. దర్యాప్తునకు తమ కుటుంబం సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.