స్కాన్ చెయ్యి.. పేమెంట్ కొట్టు.. UPI వాడకంలో తెలంగాణ దూకుడు.. ఏపీ వెనకంజ

స్కాన్ చెయ్యి.. పేమెంట్ కొట్టు.. UPI వాడకంలో తెలంగాణ దూకుడు.. ఏపీ వెనకంజ

UPI News: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రజల చెల్లింపులను అత్యంత సులభతరం చేసిన ఏకైక టెక్నాలజీ యూపీఐ పేమెంట్స్. సిటీలో ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు. ఫిన్ టెక్ సంస్థల కృషితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులను పరిచయం చేసింది. ఒక పెన్ కొన్నా లేక చాక్లెట్ కొన్నా కూడా ప్రజలు భౌతిక కరెన్సీని క్యారీ చేయటం కంటే యూపీఐ చెల్లింపులకే మెుగ్గుచూపటం దీని సక్సెస్ కి అసలైన కారణంగా ఉంది. 

అయితే కొత్త ఆర్థిక సంవత్సరం మెుదటి త్రైమాసికంలో యూపీఐ చెల్లింపుల డేటా విడుదలైంది. ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో అత్యధిక సంఖ్యలో యూపీఐ చెల్లింపులు మహారాష్ట్రలో నమోదవటంతో మెుదటి స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని తర్వాత ఇండియన్ టెక్ హబ్ కర్ణాటక రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా.. తెలంగాణ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక టాప్ 5 స్థానాల్లో చివరిగా తమిళనాడు కూడా వచ్చి చేరిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 

తొలిసారిగా ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపుల వాల్యూమ్స్ ఆధారంగా ర్యాంకింగ్ అందించగా మెుదటి నాలుగు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఏకంగా 100 కోట్ల ట్రాన్సాక్షన్లు మే నెలలో నమోదయ్యాయి. ఇక ఏపీ విషయానికి వస్తే యూపీఐ చెల్లింపుల సంఖ్యాపరంగా 8వ స్థానంలో నిలిచింది. దేశంలో యూపీఐ చెల్లింపులు ఒక నెల కాలంలో 24 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్లు నివేదించబడింది. 

ALSO READ : ట్రంప్ చర్యలతో NASA ఖాళీ.. 2 వేల మంది సీనియర్ ఉద్యోగులు రాజీనామా..

ఇక నగరాల వారీగా ఎక్కువ యూపీఐ చెల్లింపులు జరిగిన లిస్ట్ చూస్తే.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నిలిచాయి. ఈ నగరాల్లో మెుబైల్ అండ్ డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరిగాయని, చిన్నచిన్న మెుత్తాలకు కూడా యూపీఐ సేవలను ప్రజలు వినియోగిస్తున్నట్లు తేలింది. దేశంలో జరిగిన మెుత్తం యూపీఐ చెల్లింపుల్లో 13 శాతం మహారాష్ట్ర నుంచి, 7.7 శాతం కర్ణాటక నుంచి, 6 శాతం తెలంగాణ నుంచి.. 4 శాతం తమిళనాడు నుంచి రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలోని యూపీఐ చెల్లింపులు ప్రపంచ దిగ్గజ పేమెంట్ సంస్థ వీసా రోజువారీ చెల్లింపుల సంఖ్యను అధిగమించి రికార్డ్ సృష్టించింది. ఈ భారీ విజయానికి దేశంలోని మారుమూల పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలు చేరువ కావటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.