
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2వేల 145 మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు.. అందులోనూ చాలా మంది కీలక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఒకేసారి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో GS-13 నుంచి GS-15 స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు రాజీనామాలు సమర్పించటం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ భారీ సంఖ్యలో రాజీనామాలు కేవలం సాధారణ ఉద్యోగ మార్పులు కావని స్పష్టమవుతోంది. నాసా అంతర్గత వర్గాల నుండి లీకైన సమాచారం ప్రకారం.. సంస్థలో నెలకొన్న నిధుల కొరత, ప్రాజెక్టుల ఆలస్యం, పరిపాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు ఉద్యోగుల అసంతృప్తికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా.. మార్స్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు సరిపోకపోవడం, కొత్త పరిశోధనలకు ఆమోదం లభించకపోవడం వంటివి సీనియర్ శాస్త్రవేత్తలలో తీవ్ర నిరాశను కలిగించాయని వెల్లడైంది.
గొడ్దార్డ్‌లో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాల కోతలు వైట్ హౌస్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, 2027 మధ్య నాటికి చంద్రునిపై జరిగే అంతరీక్ష యాత్రలకు.. భవిష్యత్ మార్స్ ప్రణాళికలకు కీలకమైన సిబ్బందిని కోల్పోవడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రస్తుత రాజీనామాల పర్వంతో నాసా పెద్ద ప్రమాదంలో ఉందని ఒక సీనియర్ ఉద్యోగి వెల్లడించారు. కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పాటు భద్రతా ప్రమాణాలు రాజీపడే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు నాసాలో భద్రతా ప్రోటోకాల్స్‌పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వెళ్లిపోవడం వల్ల ఆర్టెమిస్ మిషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుండి వస్తున్న డేటా విశ్లేషణ వంటి కీలక ప్రాజెక్టులు కుంటుపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అమెరికా అంతరిక్ష ఆధిపత్యానికి కూడా సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాసా అధికారులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నామని, వారి ఆందోళనలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు.
ALSO READ : 2009లో రూ.2 ఇన్వెస్ట్ చేసినోళ్లు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు.. ఎందులో అంటే?
ప్రస్తుతం వైట్ హౌస్ లక్ష్యం 5వేల మందిని తొలగించాలని ఉన్నప్పటికీ.. రాజీనామాలతో సగం మాత్రమే నెరవేరింది. అయితే బడ్జెట్ కోతలు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు చాలా మంది వెళ్లిపోతున్న ఉద్యోగులకు ప్రేరణగా నిలిచాయి. ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో పరిస్థితులు భవిష్యత్తులో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.