
- మరో నలుగురికి అస్వస్థత
- లేత జున్నుపాలలో కలుపుకొని తినడం వల్లే...
- డాక్టర్లు లేకే మరణించారని దవాఖాన ముందు బంధువుల ధర్నా
మెదక్/ నర్సాపూర్/కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటరావుపేటలో ఎల్లేరు గడ్డలు (అడవి దుంప గడ్డలు) తిని తల్లీ కొడుకు చనిపోయారు. కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం...మంగళవారం వెంకటరావుపేటకు చెందిన నీలం శ్రీనివాస్ (48) తన అత్తగారి ఊరైన రాయిలాపూర్ కు వెళ్లి అక్కడ ఎల్లేరు గడ్డలు తవ్వి వెంకటరావుపేటలోని ఇంటికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి వాటిని ఉడకబెట్టుకొని జున్నుపాలలో కలుపుకుని శ్రీనివాస్‌తోపాటు అతడి భార్య లక్ష్మి, కొడుకులు రాంచందర్, శ్రీకాంత్, తల్లి వెంకటమ్మ, అక్క లలిత కలిసి తిన్నారు. పడుకున్న తర్వాత అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. విరేచనాలు ఆగకపోవడంతో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానాకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నీలం శ్రీనివాస్ (47) చనిపోగా, తల్లి వెంకటమ్మ (75) పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్తుండగా చనిపోయింది. మృతుడు శ్రీనివాస్ భార్య లక్ష్మి, అక్క లలిత చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ కొడుకులు రాంచందర్, శ్రీకాంత్ కోలుకున్నారు. లేత జున్నుపాలలో ఎల్లేరు గడ్డలు వేసుకుని తినడం వల్లే వాంతులు, విరేచనాలు అయి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని..
ప్రభుత్వ దవాఖానాలో సమయానికి డాక్టర్లు, సిబ్బంది లేక, చికిత్స అందించకపోవడం వల్లే శ్రీనివాస్, వెంకటమ్మ చనిపోయారని ఆరోపిస్తూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానా ముందు ధర్నా చేశారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకులు మురళీయాదవ్, కౌన్సిలర్లు బుచ్చేశ్‌యాదవ్, గోడ రాజేందర్ అక్కడికి వచ్చారు. మురళీ యాదవ్ మాట్లాడుతూ నర్సాపూర్‌లో ప్రభుత్వ దవాఖానాను అప్‌గ్రేడ్ చేశామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, లీడర్లు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎలాంటి వసతులు లేవన్నారు. రాత్రి సమయాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండక, అత్యవసర పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో వచ్చే వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్అందక చనిపోతున్నారన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.