సముద్ర కల్లోలాన్ని ముందే పసిగట్టొచ్చు

 సముద్ర కల్లోలాన్ని ముందే పసిగట్టొచ్చు
  • సునామీ అలర్ట్స్​కోసం ప్రత్యేకంగా ‘తరంగ్’ కంప్యూటర్​ డెవలప్ ​చేసిన ఇన్​కాయిస్​
  • వరదలపై ‘శివాస్’ వ్యవస్థ
  • మత్స్యకారులకు ‘సముద్ర 2.0’ యాప్​

హైదరాబాద్, వెలుగు: సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు అల్లకల్లోలంగా మారి ఉప్పొంగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఫలితంగా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలా సముద్ర కల్లోలంపై హెచ్చరికలు జారీ చేయడానికి కచ్చితమైన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా లేవు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం చూపించేలా హైదరాబాద్​కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్​కాయిస్) సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.

సముద్రం పరిస్థితిని అంచనా వేసి ముందే తీర ప్రాంత ప్రజలకు అలర్ట్స్ ఇచ్చే శివాస్(ఎస్ఐవీఏఎస్‌‌‌‌‌‌‌‌– స్వెల్ సర్జ్ ఇనండేషన్ వల్నరబిలిటీ అడ్వైజరీ సిస్టమ్)ను డెవలప్ చేసింది. తద్వారా సునామీతో పాటు తీర ప్రాంతాల ముంపు ముప్పుపై ముందే అలర్ట్స్​ను చేరవేయనుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థను కేరళలో వినియోగిస్తుండగా.. మరిన్ని ప్రాంతాలకు సేవలను ఇన్​కాయిస్ విస్తరించనుంది. ఇటు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు అలర్ట్స్ ఇచ్చేలా సముద్ర 2.0 యాప్​ను కూడా ఇన్​కాయిస్ తీసుకొచ్చింది. చేపలు ఎక్కువ లభించే ప్రాంతాలు, ట్యూనా ఫిష్ వేటకు అనువైన ప్రాంతాల మ్యాప్​ల ఆధారంగా ఇది అలర్ట్​లను అందిస్తుంది. జెల్లీ ఫిష్ అగ్రిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ పోర్టల్(ఏఐఐపీ)ని కూడా ఇన్​కాయిస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

సునామీ హెచ్చరికలకు ప్రత్యేక కంప్యూటర్​

సునామీ ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలను మరింత కచ్చితత్వంతో జారీ చేసేందుకు హైపెర్ఫార్మెన్స్ కంప్యూటర్ ‘తరంగ్’ను కూడా ఇన్ కాయిస్ ప్రారంభించింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పని చేసే తరంగ్​కంప్యూటర్ 24 గంటలూ హిందూ మహాసముద్ర స్థితిగతులను అంచనా వేస్తుంది. గత కొన్నేండ్లలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అకాల వర్షాలు, సముద్రం ఉప్పొంగడం వంటి కారణాలతో ఆకస్మిక వరదలు వచ్చి పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడే రాకాసి అలల తీవ్రతనూ ఈ తరంగ్ కంప్యూటర్​ ద్వారా ముందే తెలుసుకోనున్నారు.