
- దేశంలోని 100 స్టార్టప్‌లలో 15 వేల మంది తొలగింపు
- అధ్వానంగా మారిన ఎడ్‌టెక్ కంపెనీలు
- ఈ ఏడాది ఒక్క యూనికార్నే
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగులకు కలిసి రాలేదు. ముఖ్యంగా స్టార్టప్‌లలో పనిచేస్తున్న వారు తమ జాబ్స్ ఎప్పుడు ఊడుతాయా? అని భయంతో బతికారని చెప్పొచ్చు. దేశంలోని 100 స్టార్టప్ కంపెనీలే ఏకంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఫండ్స్ సేకరించడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ విడుదల చేసిన డేటా ప్రకారం, అప్పులతో ఇబ్బందులు పడుతున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ రెండో రౌండ్‌లో భాగంగా ఈ ఏడాది 2,500 మందిని తీసేసింది.
కొత్త ఇన్వెస్టర్లు రాకపోవడంతో కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ తన ఇంటిని తనఖా పెట్టి మరీ ఉద్యోగులకు సాలరీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు 20 బిలియన్ డాలర్ల దగ్గర పలికిన కంపెనీ వాల్యుయేషన్ తాజాగా 3 బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. మరి కొన్ని స్టార్టప్‌లు ఈ ఏడాది పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. ఓలా 200 మందిని, క్యాపిటల్ ఫ్రెష్ 120 మందిని , షేర్‌చాట్ 500 మందిని తీసేసింది. స్విగ్గీ (380 మంది), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), పాలిగాన్ (100), సాప్ ల్యాబ్స్ (300) వంటి స్టార్టప్‌లు కూడా తమ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను ఇచ్చాయి. వీటితో పాటు అప్‌గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1కే కిరాణ (600), డంజో (300), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్‌ట్రామార్క్స్ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), కూమ్యాథ్ (100), హప్పే (160) పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేయగా, గ్లామ్యో హెల్త్ (160), మోజోకేర్ (170) , వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్ (350), సింప్లీలెర్న్ (200), ఉడాన్ (100) వంటి స్టార్టప్‌లు కూడా అదే బాట పట్టాయి.
గ్లోబల్‌గానూ ఇదే పరిస్థితి
గ్లోబల్‌గా కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ఏడాది ఏకంగా 1,160 టెక్ కంపెనీలు 26,02,238 మందిని జాబ్స్ నుంచి తొలగించాయి. కిందటేడాది అయితే 1,064 టెక్ కంపెనీలు 1,64,969 మందిని తీసేశాయి. కొత్త ఫండ్స్ రాకపోవడంతో స్టార్టప్‌లు తమ ఖర్చులు ముఖ్యంగా మార్కెటింగ్, ఉద్యోగుల ఖర్చును తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం చూస్తే ఈ ఏడాది జనవరి – నవంబర్ మధ్య దేశంలోని స్టార్టప్‌లు సేకరించిన ఫండ్స్ 65.8 శాతం పడిపోయాయి. ఈ ఏడాది ఇండియన్ స్టార్టప్‌లు 1,013 వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ డీల్స్ ద్వారా 6.9 బిలియన్ డాలర్లు సేకరించాయని గ్లోబల్‌డేటా వెల్లడించింది.
ఇందులో ఫిజిక్స్‌వాలా సేకరించిన 250 మిలియన్ డాలర్లు అతిపెద్ద డీల్‌గా నిలిచింది. పెర్ఫియోస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ 229 మిలియన్ డాలర్లు, ఫోన్‌పే 200 మిలియన్ డాలర్లు, జెప్టో 200 మిలియన్ డాలర్లు, జెట్‌వెర్క్ 120 మిలియన్ డాలర్లు సేకరించాయి. కిందటేడాది ఇండియన్ స్టార్టప్ కంపెనీలు కేవలం నాలుగు నెలల్లోనే 10 బిలియన్ డాలర్లను వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి సేకరించాయి. ఈ ఏడాది ఒక్క జెప్టో మాత్రమే యూనికార్న్‌గా మారింది. కిందటేడాది అయితే ఏకంగా 24 స్టార్టప్‌లు యూనికార్న్ స్టేటస్ అందుకున్నాయి.