
- ఢిల్లీలోని పూసా క్యాంపస్ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
- 35,440 కోట్లతో రెండు కొత్త అగ్రి స్కీములను ప్రారంభించిన మోదీ
- ఒడిశాలోనూ 160 కోట్ల విలువైన ఫిషరీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
న్యూఢిల్లీ: వ్యవసాయానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.35,440 కోట్లతో రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. ఇందులో మొదటిది ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై)కాగా.. మరొకటి పప్పుధాన్యాలలో స్వావలంబన కోసం మిషన్(మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్స్). రెండు స్కీములు వచ్చే రబీ (శీతాకాలం) సీజన్ నుంచి 2030–-31 వరకు అమలుకానున్నాయి.
శనివారం (అక్టోబర్ 11) ఢిల్లీలోని పూసా రోడ్, రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న ఓ ప్రముఖ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సంఘ సంస్కర్తల జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరై.. అక్కడి నుంచే రూ.35,440 కోట్లతో ధన్ ధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్స్ పథకాలను ప్రారంభించారు. వీటితోపాటు ప్రధాని మోదీ ఒడిశాలోనూ 160 కోట్ల విలువైన రెండు ఫిషరీ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాలి
కార్యక్రమం ద్వారా దేశ రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.."స్వాతంత్య్రం తర్వాత దేశంలో రైతులు ఆహార కొరత లేకుండా చేశారు. ఇప్పుడు, వికసిత్ భారత్‌ను సాధించడంలోనూ మీ పాత్రే కీలకం. ఓవైపు మనం ఆహార ధాన్యాల్లో స్వావలంబన సాధిస్తూనే.. మరోవైపు ప్రపంచ మార్కెట్ డిమాండ్ ను తీర్చేలా పంటలను ఉత్పత్తి చేయాలి. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచాలి" అని అన్నారు.
వ్యవసాయంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందన్న ఆయన.. వారికి ముందుచూపే లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 'బీజ్ టు బజార్(విత్తనం నుంచి మార్కెట్)" సంస్కరణలు చేపట్టామన్నారు. ఈ చర్యల ఫలితంగానే వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 900 లక్షల టన్నులకు పెరిగిందని, పండ్లు, కూరగాయల ఉత్పత్తి 640 లక్షల టన్నులకు చేరుకుందని వివరించారు.
24వేల కోట్లతో పీఎండీడీకేవై
కొత్త స్కీముల్లో మొదటిదైన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రభుత్వం రూ.24 వేల కోట్లతో రూపొంచింది. ఇందులో భాగంగా తక్కువ పనితీరు గల 100 వ్యవసాయ జిల్లాల్లోని రైతులకు సులభమైన లోన్స్ ఇవ్వనున్నారు. రెండోదైన పప్పుధాన్యాల సాగు పెంపు పథకం రూ.11,440 కోట్లతో రూపొందింది.