
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చాలా చోట్ల రోడ్లపై విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. శనివారం రాత్రి10 గంటల నుంచి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.
ఈ వింటర్లో గంగానగర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, ఢిల్లీ, బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, తేజ్‌పూర్(అస్సాం) మీదుగా అమృత్‌సర్ నుంచి దిబ్రూగఢ్ వరకు జీరో విజిబిలిటీని నమోదు కావడం ఇదే మొదటిసారి అని ఐఎండీ సైంటిస్ట్ తెలిపారు. కాగా బీఎస్ –-3 పెట్రోల్, బీఎస్-–4 డీజిల్ ఫోర్ వీలర్ వెహికల్స్ ఢిల్లీలోకి ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. రాజస్థాన్‌లో చలిగాలుల కారణంగా టెంపరేచర్లు దారుణంగా పడిపోయాయి. ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా అత్యల్పంగా పిలానిలో 3 డిగ్రీల టెంపరేచర్నమోదు కావడం గమనార్హం.
విమానాల దారి మళ్లింపు
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో జీరో విజిబిలిటి నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా ఆదివారం ఉదయం 10 విమానాలను అధికారులు దారి మళ్లించారు. దాదాపు 100 ఫ్లైట్లు ఆలస్యమవగా, కొన్ని రద్దు అయ్యాయి.
గ్రేటర్ నోయిడాలో ప్రమాదం
పొగమంచు కారణంగా గ్రేటర్ నోయిడాలో ముందున్న వాహనాలు కనిపించక కొన్ని ట్రక్కులు ఢీకొన్నాయి. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాత్రిపూట పాల్వాల్ నుంచి నోయిడా వెళ్తున్న ఒక ట్రక్కు డివైడర్‌ను ఢీకొంది. ఆ తర్వాత, వెనుక వస్తున్న మరో 5 ట్రక్కులు దాన్ని ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ మృతి చనిపోయాడు.