మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌తో ఆర్టీసీకి పెరిగిన డిమాండ్‌‌‌‌‌‌‌‌

మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌తో ఆర్టీసీకి పెరిగిన డిమాండ్‌‌‌‌‌‌‌‌
  •      తమ గ్రామాలకు బస్సులు నడపాలంటూ భారీగా అప్లికేషన్లు
  •     కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌
  •     త్వరలోనే అన్ని గ్రామాలకు బస్సులు నడిపేలా ఆఫీసర్ల కసరత్తు

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని చాలా గ్రామాలకు బస్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో రవాణాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ చొరవతో మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు ఆర్టీసీ సేవలు ప్రారంభించారు. కన్నారం నుంచి ముల్కనూరు – మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌, వేలేరు వరకు నడిచే బస్సును కొత్తకొండ మీదుగా ముల్కనూరు వరకు పొడిగించారు. ముల్కనూర్ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక సర్వీస్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

అలాగే హనుమకొండ నుంచి ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల, కేశవాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామాలకు పదేండ్ల నుంచి బస్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో ఆ మార్గంలో ప్రజలు వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీకి రావాలంటే నానా ఇబ్బందులు పడేవారు. దీంతో కొద్దిరోజుల కిందట పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చొరవతో ఆ మార్గంలో బస్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ప్రారంభించారు. దీంతో నీరుకుళ్ల, పెంచికల్‌‌‌‌‌‌‌‌పేట, కేశవాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామాల ప్రజలు పదేండ్లుగా పడుతున్న ఇబ్బందులు తీరిపోయాయి.

హనుమకొండ, వెలుగు : ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ సేవలను ప్రతి గ్రామానికి విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఫ్రీ బస్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో కొత్త రూట్లలో నడపాలని ప్రజల నుంచి డిమాండ్లు పెరిగాయి. దీంతో వచ్చిన డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లుగా కొత్త రూట్లలో బస్సులు నడపడంతో పాటు, గతంలో నిలిచిపోయిన రూట్లను సైతం ఆర్టీసీ ఆఫీసర్లు పునరుద్ధరిస్తున్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌లోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్‌‌‌‌‌‌‌‌ మేరకు కొత్త బస్సులు కావాలంటూ ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ సైతం పంపించారు.

కొత్త బస్సుల కోసం పెరుగుతున్న అప్లికేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని తొమ్మిది డిపోల్లో మొత్తం 908 బస్సులు ఉన్నాయి. ఇందులో 581 ఆర్టీసీవి కాగా, మరో 327 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలకు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. వరంగల్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో నిత్యం సగటున నాలుగు లక్షల మంది వరకు ప్రయాణాలు సాగిస్తున్నారు. 

ఇందులో సుమారు 62 శాతం మహాలక్ష్మీ స్కీం కింద జీరో టికెట్‌‌‌‌‌‌‌‌తో ప్రయాణించే వారే కాగా, 38 శాతం మంది ఇతర ప్రయాణికులు ఉంటున్నారు. దీంతో వరంగల్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఆర్టీసీకి ప్రతిరోజు సగటున రూ.2.5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఫ్రీ బస్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీకి డిమాండ్‌‌‌‌‌‌‌‌ భారీగా పెరిగింది. దీంతో తమ గ్రామాలకు సైతం బస్సులు నడిపించేలా చూడాలని అటు ప్రజాప్రతినిధులకు, ఇటు ఆర్టీసీ ఆఫీసర్లకు ప్రజలు అప్లికేషన్లు అందజేస్తున్నారు.

కొత్త సేవలు ప్రారంభం.. పాతవి పునరుద్ధరణ

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో వివిధ కారణాలు చూపుతూ చాలా గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రూట్లతో బస్సులు నడపడంతో పాటు గతంలో నడిచి నిలిచిపోయిన సర్వీసులను కూడా పునరుద్ధరిస్తోంది. ఇందులో వేలేరు మండలం ఎర్రబెల్లి, ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం, పర్వతగిరి మండలం కల్లెడ, మంగపేట మండలం నర్సింహసాగర్, తాడ్వాయి మండలం బీరెల్లి, రంగాపురం, చిట్యాల మండలం వెంచరామి, మహదేవపూర్‌‌‌‌‌‌‌‌ మండలం పలిమెల, కాటారం మండలం దామెరకుంటకు కొత్త సర్వీసులు ప్రారంభించారు. అలాగే కొప్పుల-ములుగు, అబ్బాపూర్‌‌‌‌‌‌‌‌ -ములుగు, నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ – జమ్మికుంట, వేలేరు – పీచర, పంథని మీదుగా నల్లబెల్లి, నష్కల్‌‌‌‌‌‌‌‌ – -ఐనవోలు, ఆత్మకూరు మండలం కేశవాపూర్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌జీవోస్‌‌‌‌‌‌‌‌ కాలనీ మీదుగా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి మండలం మడిపల్లి గ్రామాలకు ఆర్టీసీ సేవలను పునరుద్ధరించారు.

కొత్త బస్సులకు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

వరంగల్ రీజియన్‌‌‌‌‌‌‌‌లో 908 బస్సులు నడుస్తుండగా కొత్త రూట్లు, పాత సేవల పునరుద్ధరణతో బస్సుల కొరత ఏర్పడుతోంది. దీంతో 40 సాధారణ, 82 ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ బస్సులు కావాలంటూ వరంగల్‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపించారు. ఈ మేరకు కొద్దిరోజుల్లోనే కొత్త బస్సులు కూడా రీజియన్‌‌‌‌‌‌‌‌కు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. బస్సుల సర్దుబాటు అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికీ ఆర్టీసీ సేవలను చేరువ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.

డిమాండ్​ మేరకు సేవలందిస్తున్నాం 

మహాలక్ష్మీ స్కీం తర్వాత ఆర్టీసీ సేవలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. గ్రామాల నుంచి వస్తున్న అప్లికేషన్ల మేరకు కొత్త రూట్లలో బస్సులను నడపడంతో పాటు నిలిచిపోయిన సర్వీసులను సైతం పునరుద్ధరిస్తున్నాం. అవసరానికి సరిపడా బస్సులకు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం బస్సులు అందించిన ప్రకారం అన్ని గ్రామాలకు ఆర్టీసీ సేవలు విస్తరిస్తాం. 
– డి.విజయభాను, వరంగర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఎం