దేవుడు లేని దేవాలయాలు

దేవుడు లేని దేవాలయాలు

జైనులు 13వ శతాబ్దంలో కట్టిన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కారణాలు ఏమైనా.. దేవాలయాల్లో దేవుళ్లను మాత్రం ప్రతిష్ఠించలేదు. ఈ మధ్యకాలంలో అడవులు అంతరించిపోతుండడంతో ఆ గుడులు బయటపడ్డాయి. దీంతో ఆ దేవాలయాల దగ్గరకు టూరిస్ట్​ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పెండ్లి ఫొటో షూటింగ్స్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్​లకు కేరాఫ్​గా మారిపోయాయి అవి.

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి  ఐదు కిలోమీటర్ల దూరంలో.. ముత్తారం గ్రామ పంచాయితీ పరిధిలోని ధర్మాబాద్ గ్రామ పరిసరాల్లో కొన్ని దేవాలయాలు ఉంటాయి. గుడి ఉంటే దేవుడు ఉండాలి. భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు కళకళలాడాలి. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు.13వ శతాబ్దంలో జైనుల కాలంలో రాఘవాపూర్ సంస్థానాధీశులు వీటిని కట్టారని పూర్వీకులు చెప్పేవాళ్లు. అవి రంగనాయకుల గుడి, ఆండాళమ్మ గుడి. ఒక ఆలయానికి మరో ఆలయానికి మధ్య రెండు వందల అడుగుల దూరం ఉంది. దాంతో రాకపోకలు సాగాలంటే రోప్​ వే వేయాలని ఆ కాలంలోనే అనుకున్నారట. ఆలయాలు కట్టడం పూర్తయ్యాక, విగ్రహాల ప్రతిష్ఠ జరగాల్సిన సమయంలో గుడి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయాడు. దీంతో ఆనాడు ఆ గుడిలో విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ఎవరూ ముందుకు రాలేదని చెప్తారు. విగ్రహ ప్రతిష్ఠకు పూనుకుంటే చనిపోతారేమో అనే మూఢనమ్మకంతో ఆలయాలను వదిలేసి ఉండొచ్చు. గుడి చుట్టూ కొండలు, దట్టమైన అడవి ఉండటంతో ఇప్పటి వరకు ధర్మాబాద్​లో ఉన్న అద్భుత కట్టడాలు వెలుగు చూడలేదు. ఈ మధ్యే ‘పల్లె ప్రకృతి వనం’ కార్యక్రమంలో భాగంగా ముత్తారం గ్రామపంచాయితీ ఆండాళమ్మ గుడి చుట్టూ ఉన్న దాదాపు మూడెకరాల పరిధిలో మొక్కలు నాటారు. పార్కు ఏర్పాటు చేశారు. దీంతో టూరిస్ట్​ల సంఖ్య పెరిగిపోయింది. వెడ్డింగ్, షార్ట్​ ఫిల్మ్ షూటింగ్స్ కోసం ఈ లొకేషన్​ బాగా ఉపయోగపడుతోంది. 

ధర్మాబాద్ రంగనాయకులు, ఆండాళమ్మ పురాతన కట్టడాలను చూడటానికి ప్రతీ ఆదివారం టూరిస్ట్​లు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ టూరిస్ట్ ప్లేస్ చుట్టూ పచ్చని చెట్లు, కొండల నడుమ ఉంటుంది. పెద్దపల్లి  పార్కు లేకపోవడంతో ఆదివారం చాలామంది తమ కుటుంబాలతో కలిసి వచ్చి కాలక్షేపం చేస్తుంటారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి షూటింగ్స్ చేసుకుంటుంటారు. 

ఆలయాలకు మూడు వైపుల నుంచి దారులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి రైల్వే ట్రాక్ దాటి గౌరెడ్డిపేట నుంచి ముత్తారం, ధర్మాబాద్ వెళ్లొచ్చు. రాఘవాపూర్ క్రాస్ నుంచి గౌరెడ్డిపేట మీదుగా ముత్తారం, ధర్మాబాద్ చేరుకోవచ్చు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి హన్మంతునిపేట కెనాల్ ద్వారా సరాసరి ధర్మాబాద్ గుడుల దగ్గరకు చేరుకోవచ్చు. ఏ దారిలో వెళ్లినా దేవాలయాలు చేరేందుకు ఐదు కిలోమీటర్ల దూరం.
- వడ్లేపల్లి రవీందర్, పెద్దపల్లి, వెలుగు