ఈ నగరానికి ఏమైంది..? గ్రేటర్ హైదరాబాద్ లో ఏటేటా పెరిగిపోతున్న కాలుష్యం

ఈ నగరానికి ఏమైంది..? గ్రేటర్ హైదరాబాద్  లో ఏటేటా పెరిగిపోతున్న కాలుష్యం
  •     ఉక్కిరి బిక్కిరి అవుతున్న సిటీవాసులు 
  •     ఏడాదిలో 300 రోజులు పొల్యూషన్​తోనే  జీవనం 
  •     శాపంగా మారిన బల్దియా, పీసీబీ నిర్లక్ష్యం 
  •     సిటీ శివారులో గుట్టల్లా పేరుకుపోయిన ఘన వ్యర్థాల డంపింగ్​
  •     పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన జలవనరులు
  •     కలగానే ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి ప్రతిపాదనలు 

హైదరాబాద్, వెలుగు : ఈ నగరానికి ఏమైంది..?  ఏటేటా పొల్యూషన్ పెరిగిపోతుంది.. జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏడాదిలో 300 రోజులు కాలుష్యంతో బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేసింది. దక్షిణ భారత్​లోని మెట్రోపాలిటన్ సిటీల్లో చూస్తే హైదరాబాద్ లోనే అత్యధి కాలుష్యం వెలువడుతున్నట్లు 4 నెలల కిందట గ్రీన్​పీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చేసిన స్టడీలో స్పష్టమైంది. బెంగళూరు, చెన్నై, కొచ్చి సిటీలతో పోలిస్తే హైదరాబాద్​లో పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5, పీఎం10 కాలుష్య కారకాల స్థాయిలు అధికంగా ఉన్నట్టు తేలింది.

ఈ ఏడాది మార్చిలోనూ ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్​లోనూ హైదరాబాద్​లో పొల్యూషన్ తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. రెండు నివేదికల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా కాలుష్యకారకాలు ఎక్కువగానే ఉంటున్నాయని పేర్కొంది. ఏడాదిలో 300 రోజుల పాటు అత్యంత హానికరమైన పీఎం 2.5 కాలుష్యకారకాలు అధికంగా విడుదలవుతున్నాయి. ఒక్క క్యూ బిక్ మీటర్ గాలిలో 40.91 మైక్రో గ్రాముల మేర పీఎం 2.5 కాలుష్య కారకాలుంటున్నాయి. 

డబ్ల్యూహెచ్​వో రిపోర్ట్ చూస్తే..

సిటీలో కాలుష్యం డబ్ల్యూహెచ్​వో (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రమాణాల కన్నా 8.2 రెట్లు అధికం. సంస్థ లెక్కల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో 5 మైక్రోగ్రాముల వరకే పీఎం 2.5 ఉంటేనే ఆ వాతావరణం సేఫ్. సిటీలో క్యూబిక్ మీటర్ గాలిలో 57.84 గ్రాముల మేర కాలుష్య కారకాలుంటున్నట్టు తేలింది. డబ్ల్యూహెచ్​వో నిర్దేశించిన 15 మైక్రోగ్రాముల కన్నా ఇవి 3.9 రెట్లు ఎక్కువ. గాలిలో నైట్రోజన్​ డై ఆక్సై డ్ స్థాయిలు డబ్ల్యూహెచ్ వో నిర్దేశించిన10 మైక్రోగ్రాముల కన్నా1.7 రెట్లు ఎక్కువగా.. అంటే 17.06 మైక్రోగ్రాముల మేర నైట్రోజన్​డై ఆక్సైడ్ గాలిలో ఉంది. ఇలా సిటీలో ఎప్పుడు చూసినా కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది. 

టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతుండగా..

కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్​ ప్రతిరోజు 7 వేల మెట్రిక్ టన్నుల డొమెస్టిక్ వేస్టేజీ, జీవ వ్యర్థాలను విడుదచేస్తుంది. అందతా సిటీ శివారులో పెద్ద డంపింగ్ యార్డుగా తయారైంది. ఘన వ్యర్థాల నుంచి వేరు చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్న ప్రభుత్వ నేతల ప్రణాళికలు కూడా కలగానే మిగిలిపోయాయి. వేల టన్నుల్లో ఉత్పత్తయ్యే సాలిడ్ వేస్ట్.. సిటీకి డేంజర్ గా తయారైంది. గుట్టలుగా కనిపించే డంపింగ్ యార్డులు.. జనాలను రోగాల బారిన పడేస్తున్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో బల్దియా నిర్లక్ష్యం సిటీవాసుల పాలిట శాపంగా మారింది. నీరు, గాలిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలపై నియంత్రణ లేకపోవడంతో కాలుష్యం నడుమ బతకాల్సి వస్తుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో బెస్ట్ అని చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉండగా ఇబ్బందులు తప్పడంలేదు. చెత్తను తరలించేందుకు ఇంకో ప్రాంతం లేక సమీప పరిసరాల్లో ఉండే స్థానికులకు నిత్యం నరకంలా మారింది.

ఇప్పటికే యార్డులో 14 మిలియన్‌ టన్నులకుపైగా చెత్త పేరుకుపోయింది.  దీని నుంచి వెలువడే కుళ్లిన, కెమికల్ వాసనలు పది కిలోమీటర్ల దూరం వస్తుంది. సిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌‌ఎంసీ కొత్త డంపింగ్‌‌ యార్డులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  మరో మూడు చోట్ల అందుబాటులోకి వచ్చి ఉంటే సమస్య తలెత్తేది కాదు.  మరో రెండు ప్రాంతాల్లో డంపింగ్​​యార్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ రెండేళ్ల కిందటే చెప్పారు.  సంగారెడ్డి జిల్లాలోని లక్డారం(దుందిగల్ సమీపంలో), మెదక్ జిల్లా ప్యారేనగర్‌(జిన్నారం)లో స్థలాలను ఎంపిక చేసినట్లు చెప్పినప్పటికీ ఇంకా డంపింగ్ యార్డులు ప్రారంభించలేదు.

పరిశ్రమలు ఔటర్ బయటకు పోలే..

సిటీలోని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించింది. ముఖ్యంగా జీడిమెట్ల, పటాన్ చెరు, పాశ మైలారం, బాచుపల్లి, ఐడీఏ బొల్లారం, కాజుపల్లి, మియాపూర్ ఏరియాల్లోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కెమికల్ గ్యాస్ తో సిటీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఫార్మా కంపెనీల్లో ఉత్పత్తయిన లింక్విడ్ వేస్టేజ్​ను పీసీబీ రూల్స్ ప్రకారం సెంట్రల్ కెమికల్ ట్రీట్​మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రీలు ఖర్చు భారం అనుకుని వీటిని శుద్ధి చేయకుండానే గుట్టు చప్పుడు కాకుండా నాలాలు, చెరువులు, కుంటల్లో పోస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు, జలవనరులు నాశనం అవుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం జీరో ఎమిషన్ వేస్టేజ్ రూల్​ను పక్కాగా అమలు చేయాల్సి ఉన్నా.. వేస్టేజ్ పరిమాణాన్ని తక్కువ చేసి చూపిస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అనుమతుల్లేని కంపెనీలు ద్రవ వ్యర్థాలను నేరుగా నాలాల్లోనే వదిలేస్తున్నాయి. కొన్ని కంపెనీలు బోర్లు వేసి అందులో వదిలేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. హుస్సేన్ సాగర్, మూసీల్లో కలిసే పారిశ్రామిక వ్యర్థాలతోః పరిసరాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. 

వచ్చే పదేళ్లలో తీవ్ర ఎఫెక్ట్

సిటీలో70 లక్షలు దాటిన వాహనాలు, రూల్స్ పాటించని పరిశ్రమలతో కాలుష్యం ఎక్కువైపోతుందని పలు సంస్థల సర్వేలు తేల్చాయి. 2018లో చేసిన స్టడీలో భాగంగా 2030 నాటికి కాలుష్య తీవ్రత అంచనా వేసింది. ఇందులో ఏటా దుమ్ము, ధూళి కణాల(పీఎం2.5) 34వేల టన్నులు గాల్లో కలుస్తుందని,  కర్బన వాయువులు 4.5లక్షల టన్నులు,  సల్ఫర్ 4,850 టన్నులు వాతావరణంలోకి చేరుతుందని పేర్కొంది.  అయితే 2030 నాటికి ఎక్కువగా పరిశ్రమల నుంచి 31శాతం, రవాణా ఎమిషన్ 27శాతం, రోడ్ అండ్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ నుంచి 26 శాతం ఉంటుందని, వచ్చే పదేళ్లలో తీవ్రత మూడింతలు పెరుగుతుంది.

ALSO READ : సాగర్ కింద ఎండుతున్న వరి.. కాలువ నీళ్లు బంద్, బోరు బావుల్లోనూ తగ్గిన నీటి మట్టం

అయితే కాలుష్య నియంత్రణ చర్యలేవి బల్దియా, పీసీబీ చేపట్టకపోవడంతో సిటీ జనాలు రోగాల బారిన పడుతుండగా.. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని వివరించింది. డబ్ల్యూహెచ్ఓ, సీపీసీబీ నివేదించిన పొల్యూషన్ రిపోర్ట్ ల ఆధారంగా నంబో అనే సంస్థ చేసిన  సర్వే నివేదికలో జల, వాయు, పర్యావరణ కాలుష్య తీవ్రతలోనూ 78శాతంతో సిటీ 64 స్థానంలో ఉందని పేర్కొంది.