IND vs AUS: శివాలెత్తిన రుతురాజ్ గైక్వాడ్.. తేలిపోయిన ఆసీస్ వీరులు

IND vs AUS: శివాలెత్తిన రుతురాజ్ గైక్వాడ్.. తేలిపోయిన ఆసీస్ వీరులు

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా ఆసీస్ బౌలర్ల కథ మారలేదు. విజయం కోసం మూడో టీ20లో ఏకంగా నాలుగు మార్పులు చేసినా మళ్లీ అదే ఫలితం పునరావృతం అయ్యింది. భారత కుర్ర కారు ఆసీస్ వీరులను చితక్కొట్టారు.

మంగళవారం(నవంబర్ 28) గౌహతి వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత యువ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(123 నాటౌట్; 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతనికి ఇదే తొలి సెంచరీ. రుతురాజ్ ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సూర్యకుమార్ యాదవ్(39; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(31 నాటౌట్; 24 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులు చేశారు. రుతురాజ్ దెబ్బకు ఆసీస్ యువ ఆల్ రౌండర్ ఆరోన్ హర్దీ తన నాలుగు ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్నాడు.