IND vs ENG: పొట్టు పొట్టు కొడుతున్న డకెట్.. 88 బంతుల్లోనే సెంచరీ

IND vs ENG: పొట్టు పొట్టు కొడుతున్న డకెట్.. 88 బంతుల్లోనే సెంచరీ

రాజ్‌కోట్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మస్త్ మజా అందిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లు అదే రీతిలో బదులిస్తున్నారు. ఎడా పెడా బౌండరీలు బాదేస్తూ.. టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా.. వన్డేలా మార్చేశారు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ బెన్ డకెట్(106*; 89 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) భారత బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. బజ్‌బాల్ దూకుడు ఎలా ఉంటదో రుచి చూపిస్తున్నాడు. 

ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగిన డకెట్.. బౌండరీల మోత మోగించాడు. ఒకవైపు క్లాసిక్ కవర్ డ్రైవ్‌లు ఆడుతూనే, మరోవైపు రివర్స్ స్వీప్ షాట్లతో ఫీల్డర్లను విసిగించాడు. అతనికి ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలన్న దానిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలుమార్లు సహచరులతో సంభాషించినా.. వ్యూహాలు ఫలించలేదు. 11 ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న డకెట్.. ఆ తరువాత మరింత రెచ్చిపోయాడు. అగ్రశ్రేణి స్పిన్నర్లైన అశ్విన్, కుల్దీప్‌లను విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో 89 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు. అతనికి ఉప్పల్ డబుల్ సెంచరీ హీరో ఓలీ పోప్(20*;) చక్కని సహకారం అందిస్తున్నాడు.

6 రన్ రేట్..

రాజ్‌కోట్‌ టెస్ట్.. వన్డేని తలపిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఓవర్‌కు 6 చొప్పున పరుగులు సాధిస్తున్నారు. బుమ్రా, అశ్విన్ పర్వాలేదనిపించినా.. మిగిలిన వాళ్ళు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. సిరాజ్ 7 ఓవర్లలో 44 పరుగులు, కుల్దీప్ యాదవ్ 6 ఓవర్లలో 42 పరుగులు, జడేజా 3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నారు.