IND vs ENG: 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఇంగ్లీష్ బౌలర్లపై సర్ఫరాజ్ ఎదురుదాడి

IND vs ENG: 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఇంగ్లీష్ బౌలర్లపై సర్ఫరాజ్ ఎదురుదాడి

భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన అరంగ్రేట మ్యాచ్‌లోనే అదరగొడుతున్నాడు. అవకాశాల కోసం ఎదురుచూసి అలసిపోయిన ఈ యువ కెరటం ఆ కోపాన్ని ఇంగ్లాండ్ బౌలర్లపై చూపిస్తున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అర్ధ శతకం బాదాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకొని.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన మూడో భారత క్రికెటర్‍గా నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్‌ ఆఫ్‌ పాటియాలా‌(42 బంతుల్లో), హార్ధిక్‌ పాండ్యా(48 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

భార్య, తండ్రి చప్పట్లు

సహచర క్రికెటర్లు ఆచి తూచి ఆడుతూ పరుగులు చేస్తుంటే.. సర్ఫరాజ్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. బంతి ఏమాత్రం దూరం పడినా.. దాన్ని బౌండరీకి తరలిస్తున్నాడు. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీకి చేరువకాగానే అతని తండ్రి నౌషాద్ ఖాన్, భార్య రొమానా జహూర్‌లు చప్పట్లు కొట్టారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్ అందుకున్నప్పుడు అతని తండ్రి నౌషాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఈ అవకాశం కోసం రెండేళ్లు ఎదురుచూశాడు.

రోహిత్ సెంచరీ

అంతకుముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(131; 196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్ లు) శతకం బాదాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమవుతున్న హిట్‌మ్యాన్‌.. కీలక సమయంలో జట్టును ఆదుకున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రవీంద్ర జడేజా(99 నాటౌట్) సాయంతో గట్టెక్కించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 207 పరుగులు జోడించారు.