
- నాలుగో టెస్టుకు ఆకాశ్, అర్ష్‌దీప్ డౌటే
- బ్యాకప్ పేసర్‌గా టీమ్‌లోకి అన్షుల్ కంబోజ్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ముంగిట టీమిండియాకు షాక్ తగిలింది. యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే ప్రమాదంలో నిలిచాడు. ఆదివారం జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో నితీశ్ రెడ్డి మోకాలికి గాయం అయింది. స్కానింగ్‌లో లిగమెంట్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నితీశ్ గాయంపై టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోయినా బుధవారం నుంచి మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్ట్‌కు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ఐదో టెస్టులో పాల్గొనడం కూడా అనుమానంగా మారింది. రెండో టెస్ట్‌లో నితీశ్ పెద్దగా రాణించకపోయినా, లార్డ్స్ మ్యాచ్‌లో కీలకమైన వికెట్లు తీశాడు. తను దూరమైతే నాలుగో మ్యాచ్‌లో మరో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి రావొచ్చు. మరోవైపు పేసర్లు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ కూడా గాయాలతో బాధపడుతున్నారు.
గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆకాశ్ మ్యాచ్ టైమ్‌కు తను కోలుకుంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాని లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ చేతికి తీవ్ర గాయమైంది. బౌలింగ్ చేసే ఎడమ చేతికే దెబ్బ తగలడంతో నాలుగో టెస్టుకు తను అందుబాటులో ఉండే చాన్స్ లేదు. గురువారం బెకెన్‌హామ్‌లో జరిగిన నెట్ సెషన్‌లో సాయి సుదర్శన్ షాట్ గట్టిగా తగలడంతో చేతికి బ్యాండేజ్ వేశారు. తను కోలుకోవడానికి కనీసం పది రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కీపర్ రిషబ్ పంత్‌కు చేతి వేలి గాయం అవ్వగా.. ఇప్పుడు నితీశ్ రెడ్డి, అర్ష్‌దీప్, ఆకాశ్ సైతం గాయాలతో ఇబ్బంది పడుతుండటం జట్టుకు ఇబ్బందిగా మారింది.
అన్షుల్‌కు పిలుపు
అర్ష్‌దీప్, ఆకాశ్ గాయాల నేపథ్యంలో బ్యాకప్ బౌలర్‌గా హర్యానా యంగ్ పేసర్ అన్షుల్ కంబోజ్‌ను జట్టులో చేర్చారు. 24 ఏండ్ల కంబోజ్ ఆదివారం టీమ్‌తో కలిశాడు. ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇండియా–ఎ తరఫున అతను ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. గతేడాది కేరళతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి కంబోజ్ వెలుగులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అతను నిలిచాడు. మొత్తంగా గత రంజీ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టిన అన్షుల్‌కు మంచి భవిష్యత్ ఉందని భావిస్తున్నారు.
ప్రాక్టీస్‌కు వాన దెబ్బ.. ఇండోర్ సెషన్‌కు కీలక ప్లేయర్లు దూరం
మాంచెస్టర్‌లో కీలకమైన నాలుగో టెస్ట్ కోసం టీమిండియా సన్నాహకాలకు వాన అడ్డొచ్చింది. వర్షం కారణంగా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సాధ్యం కాలేదు. దాంతో జట్టు ఇండోర్ నెట్ సెషన్‌ను నిర్వహించింది. అయితే కెప్టెన్ గిల్ సహా పలువురు కీలక ఆటగాళ్లు ఈ సెషన్‌కు దూరంగా ఉన్నారు. కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, గాయపడ్డ నితీశ్ రెడ్డి ప్రాక్టీస్‌కు రాలేదు. మిగతా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ గ్రౌండ్‌కు వచ్చి ఇండోర్ సెషన్‌లో సాధన చేశారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అయినప్పటికీ కీలకమైన మ్యాచ్‌కు ముందు స్టార్ ప్లేయర్లు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ప్లేయర్లతో క్రికెటర్ల మాట, ఆట
టీమిండియా ప్లేయర్లు ఇంగ్లండ్ ప్రీమియర్ సాకర్ లీగ్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఆటగాళ్లను కలిశారు. మాంచెస్టర్ గ్రౌండ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సరదాగా ఫుట్‌బాల్, క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. హెడ్ కోచ్ గంభీర్, మాంచెస్టర్ మేనేజర్ రూబెన్ అమోరిమ్ తమ జెర్సీలను మార్చుకున్నారు. క్రికెటర్లు కూడా తమ పేర్లు ముద్రించిన మాంచెస్టర్ టీమ్ జెర్సీలు వేసుకోగా..ఫుట్‌బాల్ స్టార్లు టీమిండియా జెర్సీలతో ఫొటో దిగారు. కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్ పెనాల్టీ కిక్ ప్రాక్టీస్‌లో పాల్గొని తన సాకర్ స్కిల్స్ చూపెట్టాడు. పేసర్ సిరాజ్ మాంచెస్టర్ హ్యారీ మాగ్వైర్‌కు బౌలింగ్ చేశాడు. కీపర్ పంత్ తన బ్యాట్‌ను మిడ్ ఫీల్డర్ బ్రూనోకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.