IND vs ENG: ఛీటింగ్ చేయబోయి అడ్డంగా బుక్కైన ఇంగ్లాండ్! నవ్వుతో గాలి తీసిన భారత కెప్టెన్

IND vs ENG: ఛీటింగ్ చేయబోయి అడ్డంగా బుక్కైన ఇంగ్లాండ్! నవ్వుతో గాలి తీసిన భారత కెప్టెన్

వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో ఇంగ్లాండ్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్న భార‌త బ్యాటర్లు రాంచీ టెస్టుకు వచ్చేసరికి త‌డ‌బ‌డ్డారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 300లోపే ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. య‌శ‌స్వీ జైస్వాల్(73) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. శుభ్‌మాన్ గిల్(38) పరుగులు చేయగా.. చివ‌ర్లో ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాద‌వ్(17 నాటౌట్) జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఛీటింగ్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యారు.

ఏం జరిగిందంటే..?

302/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌‌లో 353 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో శుభ్ మాన్ గిల్(38)- యశస్వి జైశ్వాల్ జోడి భార‌త ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఒలీ రాబిన్సన్‌ వేసిన 20వ ఓవర్‌ ఆఖరి బంతిని జైశ్వాల్ తప్పుగా అంచనా వేశాడు. షాట్‌ ఆడటంలో విఫలమవడంతో.. బంతి బ్యాట్ ఎడ్జ్‌ తీసుకుని కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడ్డట్లుగా అనిపించింది. వెంటనే ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

అయితే, జైశ్వాల్ క్రీజు నుంచి బయటకు కదలలేదు. సందేహంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ రివ్యూ కోరడంతో వారి కుట్ర బయటపడింది. బాల్‌ మొదట నేలను తాకి.. ఆ తర్వాత వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో అంపైర్.. నాటౌట్‌గా ప్రకటించారు. ఈ సన్నివేశాలను డగౌట్ లో కూర్చొని వీక్షించిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్ ఆటగాళ్ల లీలల పట్ల నవ్వులు చిందించాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొహాలు వాడిపోయాయి. ఔట్‌ను నాటౌట్‌గా ప్రకటించినట్లు ఎక్సప్రెషన్స్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక రెండో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాద‌వ్(17 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంకా భారత జట్టు 134 పరుగులు వెనుకబడి ఉంది.