IND vs ENG: ఒంటరి యోధుడు.. కోహ్లీ రికార్డుపై కన్నేసిన యశస్వి జైశ్వాల్

IND vs ENG: ఒంటరి యోధుడు.. కోహ్లీ రికార్డుపై కన్నేసిన యశస్వి జైశ్వాల్

21 ఏళ్ల వయస్సు.. దూకుడుగా ఆడే మనస్తత్వం.. ఐపీఎల్ ప్రదర్శన చూసి సెలెక్టర్ల నుంచి పిలుపు.. జట్టులో నిలదొక్కుకోగలడా..! లేదంటే మూన్నాళ్ల ముచ్చటేనా..! ఇవి యశస్వి జైశ్వాల్ గురించి తొలినాళ్లలో అందరినోట వినపడిన మాటలు. అలాంటి దూకుడైన సిపాయే.. ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాడు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి జట్టును ఆదుకుంటున్నాడు. లోన్ వారియర్‌లా ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు సాధిస్తూ యోధుడిలా పోరాడుతున్నాడు.

రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులోనూ యశస్వినే భారత జట్టును కష్టాలనుంచి గట్టెక్కించాడు. ఒక ఎండ్‌లో సహచర బ్యాటర్లు వీడుతున్నా.. తాను మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. 117 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 73 పరుగులు చేశాడు. ఫలితంగా భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపిస్తోంది. ఈ మ్యాచే కాదు, గడిచిన మూడు టెస్టుల్లోనూ జైశ్వాలదే భారత విజయంలో కీలక పాత్ర. 

209, 214* బ్యాక్-టు-బ్యాక్ టెస్ట్ డబుల్ సెంచరీలు బాది మూడో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో 618 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో జైశ్వాల్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ల ఒక రికార్డును అధిగమించాడు. ద్రావిడ్, కోహ్లి తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో భారతీయుడు.. జైశ్వాల్. ఈ జాబితాలో 655 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. అది మరెంతో కాలం నిలిచేలా లేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకో టెస్ట్ జరగాల్సివుండడంతో ఆ రికార్డును యశస్వి బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఒక టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు

  • విరాట్ కోహ్లీ: 2016/17 సిరీస్‌లో 655 పరుగులు
  • యశస్వి జైస్వాల్: 2023/24 సిరీస్‌లో 618* పరుగులు
  • రాహుల్ ద్రవిడ్: 2022 సిరీస్‌లో 602 పరుగులు
  • విరాట్ కోహ్లీ: 2018 సిరీస్‌లో 593 పరుగులు
  • విజయ్ మంజ్రేకర్: 1961/62 సిరీస్‌లో 586 పరుగులు