IND vs ENG:  వీడిన సస్పెన్స్‌.. విరాట్ కోహ్లీ స్థానంలో ఆర్‌సీబీ క్రికెటర్!

IND vs ENG:  వీడిన సస్పెన్స్‌.. విరాట్ కోహ్లీ స్థానంలో ఆర్‌సీబీ క్రికెటర్!

భారత్- ఇంగ్లాండ్ పోరుకు సర్వం సిద్ధమైంది. గురువారం(జనవరి 25) నుంచి ఉప్పల్ వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇదిలావుంటే, వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు టెస్టులకు విరాట్‌ కోహ్లీ దూమవ్వడంతో.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరిగింది. టెస్ట్ స్పెషలిస్టులు అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా, యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేర్లు ఎక్కవుగా వినిపించినప్పటికీ.. ఈ ముగ్గురిని వెనక్కి నెట్టి ఆర్‌సీబీ యువ క్రికెటర్ రేసులో ముందు నిలిచాడు. 

మొదటి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ స్థానంలో ఆర్‌సీబీ ఆటగాడు రజత్‌ పటీదార్‌ ఎంపికైనట్లు సమాచారం. మంగళవారం రాత్రి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట అనుభవజ్ఞుడైన ఛెతేశ్వర్‌ పుజారాను ఎంపిక చేయాలనుకున్నప్పటికీ.. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నందున పటీదార్‌ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అతని ఎంపికను సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దక్షిణాఫ్రికాపై అరంగేట్రం

పటీదార్‌.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పటీదార్.. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అనంతరం ఇంగ్లాండ్ లయన్స్‌ తో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా ఏ తరపున 151 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ 111 పరుగులు చేశాడు. 30 ఏళ్ల పటీదార్ ఇప్పటివరకూ 55 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 45.97 సగటుతో 4000 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి.

ఇండియా - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ 

  • మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
  • రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
  • మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
  • నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
  • ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల