IND Vs ENG 1st Test: 420 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

IND Vs ENG 1st Test: 420 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 316-6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో 104 పరుగులు జోడించింది. దీంతో భారత జట్టు ముందు 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంతి గింగిరాలు తిరుగుతున్న చోట భారత బ్యాటర్లు ఎలా బ్యాటింగ్‌ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికర అంశం. 

పోప్‌ ఒంటరి పోరాటం

తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు వెనుకబడ్డ ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఆట తీరే కనపరిచింది. బంతి గింగిరాలు తిరుగుతున్న చోట ఎలా బ్యాటింగ్‌ చేయాలో.. భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో ఇంగ్లండ్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌(196; 278 బంతుల్లో 21 ఫోర్లు) చూపించాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సహచరులు చేతులెత్తేసిన చోట తాను ఒంటరి పోరాటం చేసి.. భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాడు. మూడో రోజే ముగిసేలా కనిపించిన మ్యాచ్‌ను పోప్‌ రసవత్తరంగా మార్చాడు. అతనికి బెన్ ఫోక్స్(34), రెహన్ అహ్మద్(28), హార్ట్‌లీ(34) చక్కని సహకారం అందించారు.

231 పరుగుల విజయ లక్ష్యం 

సొంతగడ్డపై 231 పరుగులు సాధించడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ.. ఉప్పల్ పిచ్‌పై నాలుగో రోజు చేధించడమంటే సవాల్‌తో కూడుకున్నదే. బంతి అనూహ్యంగా స్పిన్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దూకుడు కనపరిచిన యశస్వి జైస్వాల్(80; 74 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లు) మరోసారి అలాంటి ఆరంభాన్నిస్తే టీమిండియా విజయం సునాయాసమే.