No ఫిట్‌నెస్ టెస్ట్.. No యో యో టెస్ట్: పాక్ ఆటగాళ్ల సీక్రెట్స్ బయటపెట్టిన అక్రమ్

No ఫిట్‌నెస్ టెస్ట్.. No యో యో టెస్ట్: పాక్ ఆటగాళ్ల సీక్రెట్స్ బయటపెట్టిన అక్రమ్

ఓడారు.. పరువు తీశారు.. ఉదయాన్నే లేచింది మొదలు పాక్ మాజీ ఆటగాళ్లు.. ఆ దేశ క్రికెటర్లపై ఏడుస్తున్న తీరిది. ఓడిపోవటం కొత్త కాకపోయినా.. భారత గడ్డపై ఘోర ఓటమిని వారు జీర్ణించుకోలేపోతున్నారు. అందుకే పాక్ క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బచ్చాగాళ్లను కొట్టినట్లు కొట్టారని ఒకరు వాపోతే, తమ ఆటగాళ్లకు ఆటే రాదని ఒప్పుకున్నవారు.. మరొకరు. తాజాగా ఈ విమర్శల జాబితాలోకి వసీం అక్రమ్ కూడా చేరిపోయారు. పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన వెనుక పేలవమైన ఫిట్‌నెస్‌ను అక్రమ్ హైలైట్ చేశారు.

అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే పోటీ గురుంచి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో తలపడాలంటే కేవలం నైపుణ్యం, ఫామ్‌ ఉంటే సరిపోవు.. అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్‌ ఉండాలి. భారత క్రికెట్ మేనేజ్మెంట్‌ ఈ విషయంలో చాలా సీరియస్. అందుకే అయిదేళ్ల కిందట ప్రవేశపెట్టిన యోయో ఫిట్‌నెస్‌ పరీక్షను తూచా పాటిస్తోంది. ప్రతి ఆటగాడూ అందులో పాసవ్వాలాల్సిందే. లేదంటే జట్టులో చోటు ఉండదు. కానీ పాకిస్తాన్ క్రికెటర్లకు అవేమి ఉండవట. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ దిగ్గజం వసీం అక్రమ్ బయటపెట్టారు.

"ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి నేను ఆందోళన చెందుతున్నా.. ఇప్పుడు ఫిట్‌నెస్ పరీక్ష లేదు. ఒకప్పుడు మిస్బా కోచ్‌గా, సెలెక్టర్‌గా ఉన్నప్పుడు.. అతను యో-యో, ఇతర పరీక్షలను పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కనీసం నెలకు ఒకసారైనా ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఇలానే చేస్తూ పోతే, ఇలాంటివి(భారత్ పై ఓటమి ప్రస్తావిస్తూ) మరిన్ని ఎదుర్కొంటారు.." అని అక్రమ్ పాకిస్తాన్ టీవీ షోలో మాట్లాడారు.

ఆస్ట్రేలియాతో ఢీ

పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ  మ్యాచ్ అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది.