IND vs SA 1st Test: కేఎల్ రాహుల్ సెంచరీ.. గట్టెక్కిన టీమిండియా

IND vs SA 1st Test: కేఎల్ రాహుల్ సెంచరీ.. గట్టెక్కిన టీమిండియా

దక్షిణాఫ్రికాతో జ‌రగుతున్న మొదటి టెస్టులో టీమిండియా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ లో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. 208/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా మరో 37 పరుగులు జోడించి 245 వద్ద ఆలౌటైంది. సఫారీ పేసర్ కగిసో ర‌బాడ ధాటికి స్టార్ బ్యాట‌ర్లు చేతులెత్తేసిన చోట కేఎల్ రాహ‌ల్(101; 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఆపద్భాంధవుడిలా జ‌ట్టును ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో పరుగు.. పరుగు జోడిస్తూ భారత జట్టును గ‌ట్టెక్కించాడు.

121 పరుగులకే 6 ఎవికెట్లు కోల్పోయిన టీమిండియాను సఫారీ బౌలర్లు రెండొంద‌ల లోపే చుట్టేయాల‌ని భావించారు. ఆ సమయంలో రాహుల్ వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకోవడమే కాకుండా.. శతకం బాది జట్టుకు గౌరప్రదమైన స్కోర్ అందించాడు. అతనిది 8వ టెస్ట్ సెంచరీ. కాగా, తొలి రోజు ఆట ముగిసే స‌రికి భార‌త జట్టు 8 వికెట్ల నష్టానికి 208 ప‌రుగులు చేసింది.

టాపార్డ‌ర్ విఫలం

తొలి రోజు భార‌త టాపార్డర్ పూర్తిగా విఫ‌ల‌మైంది. ఏ ఒక్కరూ సఫారీ పేసర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. రబాడ‌,  బ‌ర్గ‌ర్ ధాటికి రోహిత్ శ‌ర్మ‌(5), య‌శ‌స్వీ జైస్వాల్(17), శుభ్‌మ‌న్ గిల్(2) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ(38), అయ్య‌ర్(31) జోడి ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకున్నారు. ఆపై కొద్ది సేపటికే రబాడా కోహ్లీ, అయ్య‌ర్ ఔట్ చేసి భారత్‌ను మ‌ళ్లీ దెబ్బ‌కొట్టాడు. ఆ సమయంలో రాహుల్.. శార్దూల్ ఠాకూర్‌(24), మహమ్మద్ సిరాజ్(5) తో క‌లిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒత్తిడిలోనూ నిలకడైన ఇన్సింగ్స్ ఆడి జ‌ట్టు స్కోర్ రెండొంద‌లు దాటించాడు.