IND vs SA: శత్రువులం కాదు స్నేహితులం.. రోహిత్‌తో విభేదాలపై నోరు విప్పిన కోహ్లీ

IND vs SA: శత్రువులం కాదు స్నేహితులం.. రోహిత్‌తో విభేదాలపై నోరు విప్పిన కోహ్లీ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వీరిద్దరూ భారత జట్టుకు పిల్లర్లు లాంటి వారు. వీరిలో ఎవరు గొప్ప అనేది పోల్చలేం. ఎవరి ఆట తీరు వారిదే. ఎవరి గణాంకాలు వారివే. కోహ్లీలా రోహిత్ సెంచరీలు చేయలేకపోవడం ఎలాగో.. హిట్ మ్యాన్‌లా డబుల్ సెంచరీల విషయంలో కింగ్ వెనుకబడటమూ అంతే. అయితే, కెప్టెన్సీ కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేది గతంలో నడిచిన టాక్. వన్డే ప్రపంచ కప్‌కు ముందు ఈ విషయంపై మీడియాలో ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా, ఈ అంశంపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. 

సెంచూరియన్ వేదికగా రేపటి(డిసెంబర్ 26) నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మతో తన సాన్నిహిత్యం గురించి స్పందించాడు. అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపిన కోహ్లీ.. మైదానంలోకి దిగాక ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని వెల్లడించాడు. 

"భారత ఆటగాళ్లుగా ఎప్పుడూ జట్టును గెలిపించాలనే అనుకుంటాం. జట్టులో ఉన్న లూప్ హోల్స్‌ను కవర్ చేయాలనుకుంటాం. మ్యాచ్ ప్రణాళికల గురించి కలిసి చర్చిస్తాం. గేమ్ విషయంలో ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు రోహిత్‌తో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడతా. రోహిత్ నుంచి కూడా అలాంటి స్పందనే ఉంటుంది. హిట్ మ్యాన్  నాతో అన్ని విషయాలు చర్చిస్తాడు. మేమిద్దరమే కాదు జట్టు మొత్తం ఇలానే ఉంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుటుంది. జట్టు సభ్యులందరూ స్నేహ పూర్వకంగా ఉంటారు. ఇలాంటి మంచి వాతావరణం ఉన్నప్పుడే ఏ ఆటగాడికైనా జట్టు కోసం ఎదైనా సాధించాలనే తపన ఉంటుంది.." అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కాగా, సఫారీ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉన్న రోహిత్, కోహ్లీ టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగుతున్నారు. 1992 నుంచి ఇప్పటివరకూ ఎనిమిది సార్లు సఫారీ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఒక్కటంటే ఒక్క సిరీస్‌ గెలుచుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటోంది.