సెలెక్టర్లు మీకు భువనేశ్వర్ కనిపించలేదా! అతనిపై ఒక కన్నేసి ఉంచండి: ఆశిష్ నెహ్రా

సెలెక్టర్లు మీకు భువనేశ్వర్ కనిపించలేదా! అతనిపై ఒక కన్నేసి ఉంచండి: ఆశిష్ నెహ్రా

దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత సెలెక్టర్లు మూడు వేరు వేరు జట్లను, ముగ్గురు వేరు వేరు సారథులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20 జట్టును కుర్రాళ్లతో నింపేసిన బీసీసీఐ.. జట్టు పగ్గాలు సూర్య కుమార్ యాదవ్‌‌కు అప్పగించింది. దాదాపు వన్డేలది అదే పరిస్థితి. ఆ జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. ఇక టెస్టుల విషయానికొస్తే సీనియర్ల ముఖాలతో కళకళ లాడుతోంది. ఈ  జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. జట్టులో ఒక ఆటగాడు లేని వెలితి కనిపిస్తోందని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల(టీ20, వన్డే) సిరీస్‍ల నుంచి జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్‌లను ఎంపిక చేశారు. భారత వెటరన్ పేసర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఇటీవల కాలంలో అతడు మంచి ప్రదర్శన కనపరిచినా.. పక్కన పెట్టారు. ఈ క్రమంలో అతన్ని ఎంపిక చేయకపోవడంపై స్పందించిన నెహ్రా.. పరమిత ఓవర్ల సిరీస్‍లకు భువీని ఎంపిక చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

"దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన ఫాస్ట్ బౌలర్లను చూడగానే నాకు ఒక్క పేరు గుర్తుకొచ్చింది. అది భువనేశ్వర్ కుమార్. మీకు అర్షదీప్, ముకేశ్ కుమార్ సహా మరికొన్ని కొత్త ఆప్షన్లు మీకు ఉన్నాయని తెలుసు. కానీ అనుభవం ఉన్న భువనేశ్వర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సింది.. అతను అనుభవజ్ఞుడైన బౌలర్.. ఇప్పటికీ బాగా రాణిస్తున్నాడు. సెలెక్టర్లు అతనిపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా టీ20లు, 50 ఓవర్ల ఫార్మాట్లలో అతడిని అసలు మరిచిపోకూడదు.." అని నెహ్రా జియో సినిమా కార్యక్రమంలో వెల్లడించారు. 

2022లో చివరిసారి

భువీ భారత జట్టు తరఫున బరిలోకి దిగి ఏడాదిపైనే అయ్యింది. 2022 జనవరిలో వన్డే జట్టులో కనిపించిన భువీ, నవంబర్‌లో చివరి టీ20 ఆడాడు. ఇప్పటివరకు 86 టీ20 మ్యాచ్‍ల్లో 90 వికెట్లు, 120 వన్డేల్లో 141 వికెట్లు, 21 టెస్టు మ్యాచ్‍ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. ఈ భారత పేసర్ ఇటీవల దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 4 మ్యాచ్‍ల్లో 10 వికెట్లతో సత్తా చాటాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పక్కకు పెట్టారు.